Different Marriage: ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆడవాళ్లు మగవారిగా, మగవారు ఆడవాళ్లుగా మారటం చూస్తాం. అయితే, అది సినిమా వరకే పరిమితం అనే విషయం తెలిసి ఆ కామెడీని ఆస్వాధించాం. కానీ, అలాంటి ఘటనలే నిజంగా జరిగితే.. ఊహించడానికే అదోలా ఉంది కదా. కానీ, ఆ సినిమానే తలదన్నేలా ఓ వివాహంలో సరిగ్గా అదే సీన్ రిపీట్ అయ్యింది. పెళ్లి చేసుకున్న నవ దంపతులు.. ఒకరి వేషధారణ మరొకరు వేసుకుని పూజలు చేశారు. ఇది చూసివారికి ఆశ్చర్యమైనా.. వారికి మాత్రం శరామామూలే నట. అవును.. అది వారి సంప్రదాయం అట. అలా అమ్మాయి అబ్బాయిలా.., అబ్బాయి అమ్మాయిలా వేషధారణలో పూజలు చేస్తే ఆ దంపతులకు మంచి జరుగుతుందని వారి అభిప్రాయం. అయితే, నేటి ఆధునిక యుగంలో కూడా కుటుంబ సాంప్రదాయలను విడవకుండా యువతరం వీటిని ఆచరించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.
ఈ వింత ఆచారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బి. చెర్లోపల్లి గ్రామంలో గుమ్మా ఆవులయ్య కుమారుడు అంకయ్య, అరుణల వివాహం ఘనంగా జరిగింది. వివాహం జరిగిన తర్వాత పోలేరమ్మ, అంకాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం అబ్బాయి అమ్మాయిలా, అమ్మాయి అబ్బాయిలా వస్త్రాలు ధరించి బొల్లావులతో తప్పెట్లు, తాళాలతో గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు, నాగులపుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. పూర్వకాలం నుంచి ఈ సాంప్రదాయాన్ని యాదవుల వంశంలో స్వర్ణ, గుమ్మా ఇంటిపేరు గల వారు మాత్రమే పాటిస్తున్నారని బంధుమిత్రులు తెలిపారు.
ఆ ఇంటి పేరు గలవారు కొన్ని గ్రామాల్లో మాత్రమే ఇంటిలో వివాహం జరిగితే ఈ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారని గుమ్మా ఆవులయ్య తెలిపాడు. మార్కాపురం, కురిచేడు, అర్దవీడు, కంభం మండలాల్లో 160 కుటుంబాల వరకు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పెళ్ళి తంతు మాత్రం సాధారణంగానే జరిగినా పెళ్ళయిన తరువాత వధువు వరుడిలా, వరుడు వధువులా అలంకరించుకుని తమ కులదేవతలను పూజించడం వీరింట ఆచారంగా వస్తోంది… తరాలు మారినా, ఆధునికత సంతరించుకున్నా సాంప్రదాయాలను విడవకుండా నేటి యువతరం కూడా తమ కుటుంబ ఆచారాలను కొనసాగించడం విశేషం.
Also read:
Aadi Saikumar: ఆది కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. హీరోయిన్గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ..