YS Jagan: ‘సీఎం జగన్ ప్రజా నిధులను దుర్వినియోగం చేశారా’.. నెట్టింట వైరల్.. అసలు నిజమిదే.?

| Edited By: Ravi Kiran

Jul 24, 2023 | 4:17 PM

నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు..

YS Jagan: సీఎం జగన్ ప్రజా నిధులను దుర్వినియోగం చేశారా.. నెట్టింట వైరల్.. అసలు నిజమిదే.?
Ys Jagan
Follow us on

నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50 వేలకుపైగా ఇళ్ల నిర్మాణానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేశారు. సీ‌ఆర్‌డీఏ పరిధిలో 1402 ఎకరాలు, 25 లేఅవుట్‌లలో 50,793 మంది పేదలకు.. ఈ ఏడాది మే 26న ఏపీ సర్కార్ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇవాళ అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాడేపల్లి నుంచి రానుపోనూ కేవలం 25 కిలోమీటర్లు ఉన్న ఈ దూరాన్ని రీచ్ అయ్యేందుకు సీఎం హెలికాప్టర్‌లో వచ్చారని కొందరు నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఇదే కాకుండా ఈ ప్రోగ్రాంకు ఏకంగా 9 కోట్లు ఖర్చు చేశారని కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో.. ప్రభుత్వ అధికారులే.. దీనికి సమాధానం చెప్పారు.

ప్రభుత్వ అధికారుల సమాధానం ఇదే..

ఉదయం సీఎం రాజధాని ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి దాదాపు 47,500 మంది లబ్దిదారులతో కలిసి వచ్చారు. వాళ్ల కోసం 800 బస్‌లు ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, కృష్ణాయపాలెం రెండు చోట్లా సీఎం ప్రోగ్రామ్ ఉంది. ఆ రెండు ఊర్లకు సంబంధించిన రోడ్లపై సీఎం కాన్వాయ్ వచ్చి ఉంటే.. ఈ 800 బస్‌లను ఆపేయాల్సి వస్తుంది. వాళ్లందరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే సీఎం హెలికాప్టర్‌లో వచ్చారని సీఎంఓ అధికారులు అంటున్నారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని అంటున్నారు వైసీపీ నేతలు.

ఇక సీఎం ప్రోగ్రామ్‌కు దాదాపు 50 వేల మంది ప్రజలు వచ్చారు. వాళ్లకు స్నాక్స్, ఫుడ్ పాకెట్స్, వాటర్ ప్యాకెట్స్.. అలాగే సీఎం కోసం ఏర్పాటు చేసిన వేదిక.. బస్‌లకు అయిన ఖర్చు మొత్తం కలిపి రూ. 4 నుంచి 5 కోట్లు అయి ఉండొచ్చునని అధికారులు అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టారని వైసీపీ నేతలు దుయ్యబట్టారు.