Andhra Pradesh: ‘వజ్రాలు కావాలా నాయనా..’ ఏపీలోని ఆ ప్రాంతానికి వెళ్తే చాలు.. ఎక్కడంటే.?
మీరు అదృష్టవంతులా..? మీ అదృష్టంపై మీకు నమ్మకం ఉందా..! అయితే ఛలో పుట్లగూడెం.. ఈ ఊరు పేరు కొత్తగా వింటున్నారని అనుకోవద్దు.
గుంటూరు, జూలై 24: మీరు అదృష్టవంతులా..? మీ అదృష్టంపై మీకు నమ్మకం ఉందా..! అయితే ఛలో పుట్లగూడెం.. ఈ ఊరు పేరు కొత్తగా వింటున్నారని అనుకోవద్దు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న ఓ మారుమూల గ్రామం. అక్కడ ఏముందంటారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..!
కృష్ణానది తీర ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయన్న నానుడి మీరు వినే ఉంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ మండలం పులిచింతల నుంచి అచ్చంపేట మండలం పుట్లగూడెం వరకూ వ్యాపించిన కొండల్లో వజ్రాలు దొరుకుతాయన్నది అక్కడి స్థానికుల నమ్మకం. ఈ నమ్మకానికి చరిత్ర పుస్తకాల్లో ఉన్న కథ కూడా ఒక కారణం. ఇంతకీ అసలు అదేంటంటే..?
కోహినూర్.. అసలు ఎక్కడ దొరికింది..?
ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్ళూరులోనే దొరికింది. ఇది మన చరిత్ర పుస్తకాల్లోనే ఉంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో వజ్రాల దొరుకుతాయన్న నమ్మకం ఉంది. దీంతో ప్రతి ఏటా వజ్రాల వేట సాగుతుంటుంది. కోహినూర్ వజ్రాన్ని చూసిన నవాబు ‘కోయీ నహీ నూర్’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు.. తర్వాత అదే కోహినూర్‌గా మారిందని స్థానికంగా ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
తొలకరి వర్షాలే అదృష్ట రేఖలు…
తొలకరి జల్లులు పడితే రైతులు ఎంత సంతోషపడతారో.. అంతకంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో అదృష్టవంతులు ఆనందిస్తారు. వర్షాలు పడటంతోనే చిన్న చిన్న కర్రలు చేతిలో పట్టుకొని మహిళలు, వృద్దులు, పిల్లలు వేటకు బయల్దేరతారు. ఉదయాన్నే టిఫిన్ తిని వచ్చే వీళ్లు సాయంత్రం నాలుగు గంటల వరకూ వజ్రాల వేట సాగిస్తారు. వజ్రాల వేటతో పాటు రంగు రాళ్ళు కూడా సేకరిస్తారు. అయితే వీటిని స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటారు.
ఇతర ప్రాంతాల నుంచి…
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరగకముందు వినుకొండ, నర్సరావుపేట, త్రిపురాంతకం ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం వెదికేవారు. ప్రాజెక్టు నిర్మాణంతో బెల్లంకొండ మండలంలోని పలు ప్రాంతాలు ముంపు నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారి సంఖ్య బాగా తగ్గింది.
కూలీకి కూడా వస్తుంటారు…
స్థానికంగా ఉన్న వ్యాపారులు ఒక్కో సమయంలో రోజుకు మూడు వందల రూపాయలు కూలీ ఇచ్చి మహిళలు చేత రాళ్ళు ఏరిస్తుంటారు. వాళ్ళు తీసుకొచ్చిన రాయిలో నాణ్యతను బట్టి డబ్బులు ఇస్తుంటారు. ఇక్కడ దొరికిన రాళ్ళను ముంబైలో విక్రయిస్తుంటారు. జూలై, ఆగష్టు నెలల్లో తొలకరి వర్షాలు పడినప్పుడే ఈ వేట సాగుతుంది. ప్రత్యేకంగా స్థానికులు ఈ వర్షాలు పడుతున్న సమయాన్ని గుర్తించి వజ్రాల వేటకు సిద్దమవుతుంటారు. ఆ రెండు నెలల్లో కొద్దిరోజుల మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొంతమందికి మాత్రమే ఆ విలువైన వజ్రాలు దొరుకుతాయి. మిగిలిన వారంతా రిక్తహస్తాలతో వెనుదిరగాల్సిందే.