Pawan Kalyan: నిగ్గుతేల్చండి.. ఆ ఘటనపై విచారణకు ఆదేశించిన పవన్ కల్యాణ్..
విశాఖ పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం విశాఖ పోలీసు అధికారులను కోరారు.

విశాఖపట్నంలో తన కాన్వాయ్ కారణంగా విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవలేకపోయారనే వార్తలపై విచారణ చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా? లాంటి అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు స్పష్టం చేశారు. పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.
కాగా.. విశాఖ నగర పరిధిలోని చినముషిడివాడ ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో నిన్న జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షకు సకాలంలో చేరుకోని నలుగురు విద్యార్ధులను నిర్వాహకులు అనుమతించలేదు. ఉదయం 8.30 గంటల్లోగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉండగా.. పవన్‌కల్యాణ్ పర్యటన నేపథ్యంలో తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులతో సకాలంలో చేరుకోలేకపోయామని విద్యార్థులు చెప్పారు.
ఏ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆపలేదు: విశాఖ ట్రాఫిక్ పోలీసులు
మరోవైపు ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డులో ఏ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆపలేదని విశాఖ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిలిపివేయడం వల్లే పరీక్షకు సకాలంలో చేరుకోలేకపోయామని కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. కాన్వాయ్ వెళ్లే సమయంలో కూడా సర్వీస్ రోడ్లలో రాకపోకలను ఆపలేదని చెబుతున్నారు పోలీసులు. అందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు విడుదల చేశారు.
ఇదిలాఉంటే.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించడానికి 1,005 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 1,069 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.