Funeral Rituals: చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టడానికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది. అల్లూరి జిల్లా పాడేరు లో రమణ అనే నాయీ బ్రాహ్మణుడు బుధవారం మృతి చెందాడు. అతనికి వారసులు లేకపోవడంతో కూతురే తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. కన్నీళ్లు నిండిన కళ్ళతో, బరువెక్కిన గుండెతో తలకొరివి పెట్టి తండ్రి ఋణం తీర్చుకుంది. కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న రమణ నిన్న గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. రమణకు ముగ్గురు సంతానం, ముగ్గురూ కూతుర్లే. వారసులు లేకపోవడంతో ముగ్గురు కూతుళ్ళలో పెద్ద కుమార్తె స్వాతి.. ‘నాన్నకి అంత్యక్రియలు నేనే చేస్తా’నని ముందుకొచ్చింది. అన్నీ తానై తన తండ్రికి అంతిమ సంస్కారాలు స్వయంగా నిర్వహించింది.
ఎంతగానో ప్రేమించే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుమార్తెలు తల్లడిల్లిపోయారు. ఇక తాము ఎవరి కోసం బతికేదంటూ కన్నీరు మునిరై విలపించారు. ముఖ్యంగా పెద్ద కుమార్తె స్వాతిని ఓదార్చడం చుట్టుపక్కలవారికి కష్టమైంది. ఆమె ఆవేదన అందరినీ కలచి వేసింది. గుండె నిండా బాధ, కన్నీళ్లు నిండిన కళ్ళతో వస్తున్న దు:ఖ్ఖాన్ని దిగమింగుకుని బంధువులు, ఇరుగుపొరుగు సహకారంతో.. తండ్రికి అంత్యక్రియలు పూర్తిచేసింది స్వాతి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..