AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు రోజుల కిందట చిన్నారి, ఇప్పుడు చిన్నారి తల్లి, అమ్మమ్మ మృతి..! అసలు ఏం జరిగిందంటే..?

శ్రీకాకుళంలోని గూడెం గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారి చంద్రిక మృతిపై విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై, పోలీసు విచారణ జరుగుతుండగానే అమ్మ వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రమ్మ ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు సంచలనంగా మారింది.

మూడు రోజుల కిందట చిన్నారి, ఇప్పుడు చిన్నారి తల్లి, అమ్మమ్మ మృతి..!  అసలు ఏం జరిగిందంటే..?
Daughter And Mother Commit Suicide
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Apr 27, 2025 | 6:16 PM

Share

విశాఖలో కలకలం రేపిన 11 ఏళ్ల చిన్నారి పూర్ణ చంద్రిక మృతి కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చిన్నారి తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రమ్మ శనివారం(ఏప్రిల్ 26) రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళంలోని గూడెం గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఇద్దరు మృతి చెందారు. చిన్నారి చంద్రిక మృతిపై విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై, పోలీసు విచారణ జరుగుతుండగానే అమ్మ వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రమ్మ ఆత్మహత్య చేసుకోవడం ఇపుడు సంచలనంగా మారింది.

శ్రీకాకుళం లోని గూడెం గ్రామంలో తల్లి కూతుళ్ళ మృతి కలకలం రేపింది. గూడెం గ్రామానికి చెందిన సావిత్రమ్మ, ఆమె కుమార్తె వరలక్ష్మి శనివారం రాత్రి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వరలక్ష్మి కుమార్తె 11 ఏళ్ల పూర్ణ చంద్రిక మూడు రోజులు కిందట విశాఖలో మృతి చెందగా మనస్తాపానికి గురైన చిన్నారి తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రమ్మ ఆత్మహత్య చేసుకున్నారు.

వరలక్ష్మికి విజయనగరం జిల్లా డెంకాడికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి 11 ఏళ్ల పూర్ణచంద్రిక అనే కుమార్తె ఉంది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు కారణంగా కొన్నేళ్లుగా వరలక్ష్మి భర్త ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి చనిపోయి ఒంటరిగా ఉంటున్న సావిత్రమ్మను డెoకాడ తీసుకువచ్చిన వరలక్ష్మి.. తల్లి, కుమార్తెలతో కలిసి డెంకాడలో నివాసం ఉంటోంది. అయితే ఇటీవల వరలక్ష్మి కుమార్తె చంద్రిక కొద్ది రోజులుగా మానసికపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. అయితే చిన్నారికి గాలి సోకిందని భావించి ఆమె తల్లి, అమ్మమ్మ సమీపంలోని రెండు చర్చిలకు తీసుకువెళ్ళి ప్రార్థనలు జరిపి చిన్నారికి సోకిన సమస్యను పరిష్కరించాలని కోరారు.

అయినా ఫలితం లేకపోవడంతో గురువారం విశాఖ జ్ఞానాపురంలోని ఓ చర్చికి తీసుకువెళ్ళి చూపించారు. అక్కడ చిన్నారికి ప్రార్థనలు జరిపారు. అంతకు ముందే చిన్నారి కరుస్తోందంటూ ఇంటి వద్దే చంద్రిక నోట్లో గుడ్డలు కుక్కి చర్చికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆ చిన్నారి ఊపిరాడక మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై విశాఖపట్నంలోని కంచరపాలెంలో కేసు నమోదు చేశారు.

సీన్ కట్ చేస్తే…శనివారం రాత్రి మృతి చెందిన చిన్నారి తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రమ్మ శ్రీకాకుళంలోని గూడెం గ్రామ శివారులో వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం బావిలో ఇద్దరు మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బావిలోని ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి పోస్టుమార్టం నిమిత్త తరలించారు.

సావిత్రమ్మ, వరలక్ష్మి ల మృతిపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కగాని ఒక్క కుమార్తెన చిన్నారి చంద్రిక మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై వరలక్ష్మి, సావిత్రమ్మ మృతి చెంది ఉంటారని అందరూ భావిస్తున్నారు. దీనికి తోడు తమ మూఢ నమ్మకమే చిన్నారి మృతికి కారణం అన్న విమర్శలు వారిని కలచి వేయగా, చిన్నారి మృతిపై పోలీసు కేసు నమోదు చేయడంతో మరింత ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

సావిత్రమ్మ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా గూడెం గ్రామం అయినా ఆమె భర్త మృతి చెందాక ఉన్న ఇంటిని అమ్మేసి వీరు గూడెం గ్రామానికి దూరంగా విజయనగరం జిల్లా డెంకాడలో ఉంటున్నారు. మనస్పర్ధలు కారణoగా గూడెం గ్రామంలోని బందువులకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి సావిత్రమ్మ, వరలక్ష్మి తిరిగి గూడెం గ్రామానికి రావడం అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చి ఉంటారని అంతా భావిస్తున్నారు. శనివారం రాత్రి గ్రామంలోకి వస్తూనే గ్రామంలో అడుగు పెట్టకుండానే వారు ప్లాస్టిక్ కవర్ తో తెచ్చుకున్న లగేజీతో పాటు గ్రామ పొలిమేరల్లో ఉన్న వ్యవసాయ బావిలో పడి చనిపోయినట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా పెద్దల మూఢ నమ్మకాలకు చిన్నారి చంద్రిక బలికాగా.. చిన్నారి మృతితో మనస్తాపం చెంది, పరిస్థితులను ఎదుర్కొని బతికే ధైర్యంలేక ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. సావిత్రమ్మ, వరలక్ష్మి మృతితో గూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..