దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడి ఘటనలో దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగు చూశాయి. ఐఈడీ పేలుడు జరిపేందుకు రెండు నెలల క్రితమే మావోయిస్టులు పథక రచన చేసినట్లు వెల్లడైంది. జవాన్లను మట్టు పెట్టేందుకు సొరంగమే తవ్వినట్లు తేలింది. కేంద్ర బలగాలు అత్యంత ఆధునికమైన ఆయుధాలు కలిగి ఉంటాయి. అడవులను జల్లెడ పడుతున్నప్పుడు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయంటే దానిపై పూర్తి అవగాహన ఉన్న తర్వాతే అందులోకి దిగుతాయి. కానీ దంతేవాడ డీఆర్జీ జవాన్లపై మావోయిస్టులు విరుచుకుపడిన తీరు చూస్తుంటే ఇదేదీ ఆషామాషీ వ్యవహారం లాగా అనిపించడం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన దర్యాప్తు అధికారులు చేపట్టారు. అయితే వారి విచారణలో దిగ్బ్రాంతి కరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ఏప్రిల్ 26న మావోయిస్టులు జరిపిన దాడికి సంబంధించి కీలక విషయాలు తెలిశాయి. దంతెవాడలో డీఆర్జీ జవాన్లపై మావోయిస్టులు పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ రహదారిపై వెళ్లే వాహనాల సమాచారం పక్కాగా మావోలకు ఎప్పటికప్పుడు చేరినట్లు భావిస్తున్నారు. దాడికి రెండు నెలల ముందే మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఐఈడీ పాతిపెట్టారని అధికారులు తేల్చారు. ఐఈడీని పేల్చేందుకు మావోయిస్టులు వైరు ఉపయోగించారని.. దాన్ని ఉంచిన నేలపై గడ్డి పెరగడాన్ని తాము గుర్తించామని అధికారులు తెలిపారు. పేలుడుకు దాదాపు 40 నుంచి 50 కిలోల ఐఈడీ వినియోగించి ఉంటారని అధికారులు అంచనా వేశారు. దాన్ని పాతిపెట్టేందుకు 3 నుంచి 4 అడుగుల లోతులో.. రోడ్డుపై గొయ్యి తవ్వారని అధికారులు వెల్లడించారు.
దాడి జరిగిన ముందు రోజు బాంబును గుర్తించే టీం.. పోలీసులు ప్రయాణించే మార్గాన్ని తనిఖీ చేసిందని అధికారులు వెల్లడించారు. కానీ ఆ ఐఈడీని తాము గుర్తించలేకపోయామని వారు తెలిపారు. బాంబును గుర్తించకుండా మావోయిస్టులు.. ఏదైనా పరికరాన్ని అమర్చి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బాంబు గుర్తించేందుకు ఎందుకు వీలు కాలేదన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ఈ దాడికి 200 మీటర్ల దూరంలో స్థానిక గిరిజనులు ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ‘ఆమ పండం’ అనే వేడుకకు చందాలు వసూలు చేస్తున్నారు. వీళ్లు పోలీసులను గానీ, భద్రతా సిబ్బందిని గానీ డబ్బులు అడగరు. కానీ వాళ్లే గిరిజనుల చేతిలో ఎంతోకొంత పెడుతుంటారు. అయితే పోలీసులపై రెక్కీ నిర్వహించేందుకు.. మావోయిస్టు సభ్యుల్లో ఒకరు ఈ స్థానికుల్లో చేరి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..