సైబర్ క్రైమ్ కేటుగాళ్లు రోజురోజుకి కొత్త వ్యూహాలు వేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌కే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం మీరు ముంబైలో రోడ్డు ప్రమాదం చేశారు.. ఒకరు చనిపోయారు. మీపై ముంబై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారని ఫోన్ చేసి బెదిరించారు. ఆపై డిజిటల్ అరెస్ట్ కు ప్రయత్నం చేశారు. అంతా క్షణాల్లో జరిగిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు కూపీలాగే పనిలో పడ్డారు.
అసలు ఏం జరిగిందంటే.. విజయవాడకు చెందిన ఒక సీఐ వ్యక్తిగత పనుల మీద ముంబై వెళ్లారు. అక్కడ ఒక హోటల్లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇచ్చి గదిలోకి దిగారు. ఐదు రోజుల తర్వాత డిసెంబర 19వ తేదీన గురువారం విమానంలో విజయవాడకు వచ్చేశారు. శుక్రవారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు. మీరు ముంబై వచ్చారా అని ఆరా తీశారు. అక్కడ ఒక రోడ్డు యాక్సిడెంట్ చేశారని.. మీ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని బెదిరించడం ప్రారంభించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే ఎన్నో కేసులను డీల్ చేసిన సీఐకే అదే తరహా ఫోన్ రావడంతో కంగుతిన్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి తనదైన శైలిలో ప్రశ్నలు వేసి క్లాస్ తీసుకోవడంతో నేరగాళ్లు ఫోన్ పెట్టేశారు.
మాస్డ్క్ ఆధార్ ఇస్తే మేలు.. హోటల్లో ఇస్తున్న ఆధార్ కార్డు ఇతర వివరాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనటానికి ఇది ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కరూ మాస్డ్క్ ఆధార్ కార్డు ఇస్తే బాగుంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డులోని 12 అంకెల స్థానంలో చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి మిగిలిన వాటి స్థానంలో ఎక్స్ గుర్తు ఉంటుంది. ఇలాంటి ఆధార్ కార్డులతో చాలా వరకు మోసాలు నివారించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో బ్యాంకింగ్, ఆధార్ నెంబర్లతో సంబంధంలేని ఫోన్ నెంబర్లు ఇస్తే మేలని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..