
సంక్రాంతికి కోళ్ల పందేలు… ఎడ్ల పోటీలు.. గుర్రం పోటీలు.. కామన్. కానీ పశువుల సహకారంతో రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో చేసుకునే పండగ సంక్రాంతికి ఆ పాడి పశువులను ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాం. మహాలక్ష్మి అమ్మవారి స్వరూపమైన గోమాతను పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తించే కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో జరిగింది. కనుమ పండుగ సందర్భంగా మునగపాకలో ఉత్సాహంగా గోమాతల అలంకరణ, ఆరోగ్య పోటీలు నిర్వహించారు. ఎవరైతే తమ గోమాతకు దాని బాగోగులను చూసుకుంటూ ఆరోగ్యకరంగా పెంచుతూ.. పండుగ పూట ప్రత్యేకంగా అలంకరణ చేస్తారో.. వారికి నగదు బహుమతులు అందించారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా జరిగిన.. ఈ గోమాతల అలంకరణ ఆరోగ్య పోటీల్లో పాల్గొనేందుకు వేర్వేరు జాతుల గోవులను తీసుకువచ్చారు పాడి రైతులు. దేశి, పుంగనూరు, పూటీస్, జెర్సీసహా పోటీల్లో 56 గోవులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. పోటీల నిర్వహణ కాదు.. తద్వారా ఆరోగ్యకరమైన వాతావరణంలో గోమాతలు పెంచేలా అవగాహన కల్పించారు నిర్వాహకులు. ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైస్ అందించారు. ఫస్ట్ ప్రైజ్ రూ.50 వేల నగదు, సెకండ్ ప్రైస్ రూ.40వేలు థర్డ్ ప్రైస్ రూ.30వేలు బహుమతి అందించారు. కార్యక్రమానికి ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ హాజరయ్యారు.
పశువుల నుండి పాలు పితికి, దుక్కులు దున్ని అవసరానికి వాటిని వినియోగించడమే కాకుండా వాటికి ఎప్పటికప్పుడు మంచి ఆహారం అందిస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ పశువులను పెంచాలని రైతులకు శ్రద్ధ కలిగేలా ఈ పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందిస్తున్నమన్నారు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. రాష్ట్రంలో తొలి సారిగా ఇటువంటి పోటీలు మునగపాక లోనే నిర్వహించారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ గోవుల పోటీలను చూసేందుకు భారీగా పాడి రైతులతోపాటు జనం కూడా తరలివచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.