Kurnool District: తెల్లవారుజామున కెనాల్ ఒడ్డున ఒంటరిగా బాలుడు.. స్థానికులు ఆరా తీయగా షాక్
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించేందుకు వెళ్లిన భార్యభర్తలు ప్రమాదవశాత్తూ కెనాల్‌లో పడి మృతిచెందారు.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించేందుకు వెళ్లిన భార్యభర్తలు ప్రమాదవశాత్తూ కెనాల్‌లో పడి మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అబ్బాస్ నగర్‌కు చెందిన దంపతులు తనయుడితో కలిసి తెల్లవారుజామున 5 గంటలకు వినాయక ఘాట్ దగ్గర ఉన్న కేసీ కెనాల్ వద్ద దీపాలు వెలిగించేందుకు వెళ్లారు. దీపం వెలిగిస్తూ ఉండగా తొలుత భార్య ఇందిర నీటిలో పడి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయింది. కళ్లెదుటే కొట్టుకుపోతున్న భార్యను రక్షించేందుకు భర్త రాఘవేంద్ర కూడా నీటిలోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీళ్ళలో కొట్టుకు పోయారు. కేసీ కెనాల్ గట్టున ఉన్న 8 ఏళ్ళ కొడుకు నిస్సహాయతతో చూస్తూ ఉండి పోయాడు. వారు కొట్టుకుపోతున్న సమయంలో సమీపంలో ఎవరూ లేరు. ఆ తర్వాత దీపం వెలిగించేందుకు వచ్చినవారు ఒంటరిగా ఉన్న పిల్లవాడిని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు పది కిలోమీటర్ల దూరంలోని పడిదెంపాడు దగ్గర ఇద్దరు మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలిసి కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతి చెందిన రాఘవేంద్ర టీజీవీ ఫ్యాక్టరీలో ఉద్యోగి అని తెలిసింది.
Also Read: ఆ జిల్లాలకు ప్రత్యేక అధికారులు.. వారికి రూ.2వేలు తక్షణ సాయం: సీఎం జగన్