Amaravathi: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

Andhra Pradesh: ఈ ఐకానిక్ భవనం నిర్మాణానికి సుమారు 45 వేల టన్నుల స్టీల్ వినియోగించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. భవనం భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ నాణ్యత గల నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్..

Amaravathi: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
Andhra Pradesh Cm Chandrababu Naidu

Edited By:

Updated on: Dec 25, 2025 | 9:35 PM

Andhra Pradesh: రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం మొదలైంది. న్యాయ వ్యవస్థకు ప్రతీకగా నిలిచే హైకోర్టు భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. అమరావతి రాజధానిలో హైకోర్టు భవనానికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంగళవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి భూమిపూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు.రాజధాని నిర్మాణం తిరిగి గాడిలో పడుతున్న నేపథ్యంలో హైకోర్టు పనుల ప్రారంభం అమరావతికి మరో మైలురాయిగా మారింది. గతంలో అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయింది. పరిపాలనా, న్యాయ వ్యవస్థలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుండగా, హైకోర్టు భవనం ఆ దిశగా కీలక పాత్ర పోషించనుంది.

హైకోర్టు భవనాన్ని B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ నిర్మాణంగా చేపడుతున్నట్లు పురపాలక శాఖా మంత్రి నారాయణ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన డిజైన్ ఆధారంగా ఈ నిర్మాణం సాగుతుందని చెప్పారు. న్యాయ వ్యవస్థ గౌరవం, భవిష్యత్తు అవసరాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించారని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: RBI: ఇక 10 రూపాయల నోట్లు కనిపించవా..? ఆర్బీఐ అసలు ప్లాన్‌ ఇదే!

ఇవి కూడా చదవండి

ఐకానిక్ భవనాల దిశగా అమరావతి

అమరావతిలో మొత్తం ఏడు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు వంటి కీలక భవనాలు ప్రత్యేక ఆకృతితో, ఆధునిక సదుపాయాలతో నిర్మితమవుతాయని నారాయణ తెలిపారు. హైకోర్టు భవనం ఈ శ్రేణిలో ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయితే అమరావతి రాజధాని రూపురేఖలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్లానింగ్ స్థాయిలో ఉన్న రాజధాని నిర్మాణం ఇప్పుడు కాంక్రీట్ దశలోకి అడుగుపెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం:

హైకోర్టు భవనం మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 52 కోర్టు హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది అవసరాలకు అనుగుణంగా విస్తృత స్థలాన్ని కేటాయించారు. కోర్టు హాళ్ల పంపిణీ కూడా స్పష్టంగా రూపొందించారు. 2వ, 4వ, 6వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో న్యాయ ప్రక్రియలు సులభంగా, వ్యవస్థబద్ధంగా సాగేందుకు అవకాశం ఉంటుంది.

భారీ స్థాయిలో స్టీల్ వినియోగం:

ఈ ఐకానిక్ భవనం నిర్మాణానికి సుమారు 45 వేల టన్నుల స్టీల్ వినియోగించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. భవనం భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ నాణ్యత గల నిర్మాణ సామగ్రిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తయిన తర్వాత దశలవారీగా సూపర్ స్ట్రక్చర్ పనులు ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. నిర్మాణం మొత్తం శాస్త్రీయంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాగుతుందని స్పష్టం చేశారు.

2027 డిసెంబర్ లక్ష్యం గా..

హైకోర్టు భవన నిర్మాణాన్ని 2027 చివరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనులన్నీ ఒకే టైమ్‌లైన్‌లో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు భవనం పూర్తి కావడం వల్ల న్యాయవ్యవస్థకు శాశ్వత ప్రాతిపదిక ఏర్పడుతుందని, రాజధాని వ్యవస్థాపనకు బలం చేకూరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

న్యాయ వ్యవస్థకు శాశ్వత చిరునామా:

అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయితే, రాష్ట్ర న్యాయ వ్యవస్థకు శాశ్వత చిరునామా లభించనుంది. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ఏర్పాట్లకు ఇది ముగింపు పలుకుతుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయవాదుల సహాయకులు, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఒకేచోట లభించేలా ఈ భవనం రూపకల్పన చేశారు.

ఇది కూడా చదవండి: Electric Splendor Bike: పాత స్ప్లెండర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చుకోండి.. కిట్‌ కేవలం రూ.35,000కే.. రేంజ్‌ ఎంతో తెలుసా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి