AP Reorganization of Districts: రాయలసీమకు సముద్ర తీరం తెప్పించిన జగన్‌ సర్కార్‌.. అదెలాగంటే..

|

Jan 27, 2022 | 8:32 PM

AP Reorganization of Districts: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర స్వరూపమే మారిపోయింది.

AP Reorganization of Districts: రాయలసీమకు సముద్ర తీరం తెప్పించిన జగన్‌ సర్కార్‌.. అదెలాగంటే..
Follow us on

AP Reorganization of Districts: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర స్వరూపమే మారిపోయింది. ఇప్పటి వరకు నీటి ఎద్దడి ప్రాంతంగా పేరొందిన రాయలసీమ.. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం కలిగిన సీమ గా మారిపోయింది. అవును.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళికంగా పెను మార్పు చోటుచేసుకోనుంది. ఇప్పటి వరకూ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్తా జిల్లాలకు మాత్రమే తీర ప్రాంతం ఉండేది. రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలకు భౌగోళికంగా సముద్ర తీర ప్రాంతం లేదు. కానీ, ఇప్పుడు సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలో కలపడంతో.. తిరుపతి జిల్లా కోస్తా జిల్లాగా మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ కోస్తా జిల్లాలు 9, రాయలసీమ జిల్లాలు 4 కలిసి మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయంతో రాష్ట్ర భౌగోళిక స్వరూపమే మారిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కోస్తా సముద్ర తీర ప్రాంతం కలిగిన జిల్లాలు 12 కాగా, తీర ప్రాంతం లేని జిల్లాలు 14 అయ్యాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో తిరుపతి కోస్తా జిల్లాగా మారిపోవడమే అన్నిటికంటే పెద్ద విషేషంగా చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాకు చెందిన తీర ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాలు సూళ్లూరుపేట, గూడూరులను తిరుపతి జిల్లాలో కలపడమే దీనికి కారణం. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలూ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉండటం వల్లే వీటిని ఆ జిల్లాల్లో కలిపారు.

కాగా, ఇంతకు ముందు నాలుగు జిల్లాలు కలిగిన రాయలసీమ ప్రాంతం ఇప్పుడు ఎనిమిది జిల్లాలుగా మారింది. అవి నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి(పుట్టపర్తి), వైఎస్సార్‌ కడప, అన్నమయ్య (రాయచోటి), చిత్తూరు, శ్రీబాలాజీ (తిరుపతి) జిల్లాలు. అయితే ఇందులోని తిరుపతిని కోస్తా జిల్లాగా లెక్క వేయాలా? లేక తీరప్రాంతం కలిగిన రాయలసీమ జిల్లాగానే లెక్కవేస్తారా చూడాలి.

శ్రీ బాలాజీ (తిరుపతి) జిల్లా పూర్తి వివరాలు..
హెడ్‌ క్వార్టర్‌ : తిరుపతి
రెవెన్యూ డివిజన్లు : తిరుపతి, గూడూరు, నాయుడుపేట
మండలాలు-35 : తిరుపతిలోకి 11 మండలాలు, గూడూరుకి 11 మండలాలు, నాయుడుపేటకు 13 మండలాలు వచ్చాయి.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని కాలువలోయ, నెల్లూరు డివిజన్‌ పరిధిలోని రావూరు మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. అలాగే, నెల్లూరు జిల్లాకు చెందిన సూళ్లూరుపేట, ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవానిసత్రం, తడ మండలాలను నాయుడుపేట డివిజన్‌లో కలిపారు. తిరుపతి డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాలను కూడా నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కేవీబీ పురం, సత్యవేడు, బిఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం మండలాలను నాయుడుపేట డివిజన్‌లో కలిపారు.
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు: సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు
విస్తీర్ణం : 9,176 చ.కి.మీ
జనాభా: 22.18 లక్షలు.

ఇదిలాఉంటే.. సుళ్లూరుపేటతో పాటు మైపాడ్ బీచ్ కూడా ఇప్పుడు శ్రీబాలాజీ జిల్లా కిందకు వస్తుంది. అంటే రాయలసీమకు కూడా ఇప్పుడు బీచ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నమాట. ఇక పోర్టు కడితే.. రాయలసీమ పోర్టుగా ప్రసిద్ధికెక్కుతుందని కొంత మంది అప్పుడే విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రాయలసీమకు ఎవరూ ఊహించని ఓ ప్రత్యేకత జిల్లాల విభజనతో వస్తోందని అనుకోవచ్చు. ఏదేమైనా రాయలసీమకు సముద్రం అనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది.

Also read:

CSIR UGC NET June 2021 Exams: సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ జూన్ 2021 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

Andhra Pradesh: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పాఠశాలలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వ్యర్థాల పరిస్థితి ఏంటి..?