CM Jagan: టిడ్కో ఇళ్లపై టీడీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టండి.. అధికారులకు సీఎం జగన్ సూచనలు..
హౌసింగ్ స్కీమ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం YS జగన్మోహన్ రెడ్డి. జగనన్న కాలనీల నిర్మాణం..కొత్తగా వచ్చిన ధరఖాస్తుల పరిశీలన వంటి అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా పేదల ఇళ్ల పథకం పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్.
గృహ నిర్మాణశాఖపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌పై పెట్టిన ఖర్చు వివరాలు, ఈ యేడాది ఖర్చుచేయనున్న వివరాలను అధికారులు సీఎం జగన్‌కు నివేదిక అందించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు 43 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఇప్పటివరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధం చేసిన ఇళ్ల సంఖ్య 4,67,551 అధికారులు సీఎం జగన్‌కి వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.
కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ ఆరా తీశారు. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిపెట్టాలన్న సీఎం, భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా ప్రత్యేక వ్యవస్థను కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
టిడ్కో ఇళ్లపై అసత్య ప్రచారం, విష ప్రచారాల వ్యవహరంపై సీఎం జగన్ అధికారులతో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. ఎప్పటికప్పుడు అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు 21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామని అధికారులకు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం