CM Jagan: ఎవరి కోసమైతే ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాలు చేపడుతుందో వారికి రాజమార్గంలో ఆ ఫలాలు అందాలి. లబ్ధిదారులకు ఎవ్వరి దగ్గర దేహీ అనే పరిస్థితి రాకూడాదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రతి 2వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు అందుబాటులోకి రానుంది. ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయి. దీంతో పాటు.. ఆ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని భూములపై తగిన పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. ఫలితంగా భూ ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. అర్హులైన పేదలందరికీ 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందని మరోసారి స్పష్టంచేశారు.
కాగా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ‘క్లాప్’ కార్యక్రమంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఆర్‌అండ్‌బి శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అదే సమయంలో కన్‌స్ట్రక్షన్, డిమాలిషన్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పైనా ఫోకస్ ఉండాలన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇప్పటికే ప్రత్యేక ప్లాంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో కూడా అలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.