సార్వత్రిక ఎన్నికల్లో తుది అంకానికి వైఎస్ జగన్ రంగం సిద్ధం చేసుకున్నారు. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈబస్సు యాత్ర ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే శ్రీకాకుళం నుంచి నేరుగా సీఎం జగన్ పులివెందుల వెళ్లనున్నారు. ఏప్రిల్ 25న పులివెందులలో ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి నాంది పలకబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల పరిధిలో 100 బహిరంగ సభల్లో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు జిల్లాల్లో ముగిసిన నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారు. ఇప్పటివరకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర అలాగే సిద్ధం బహిరంగ సభలు జరిగిన పార్లమెంటరీ కేంద్రాలను మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో రోజుకి నాలుగు నుంచి ఐదు సభలు ఉండేలాగా కార్యాచరణను సిద్ధం చేస్తుంది వైసీపీ. అందుకోసం ప్రత్యేకించి ఇన్చార్జిలను సైతం నియమించబోతోంది. వీటికోసం ప్రత్యేకంగా ఏఏ నియోజకవర్గాల్లో సభలు జరగాలి ఏ నియోజకవర్గాల్లో పర్యటించాలి, ఎప్పుడు పర్యటించాలి, ఎలా పర్యటించాలి అనే దానిపైన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు సీఎం జగన్.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకించి ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రత్యేకంగా బహిరంగ సభలు సమావేశాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే వైసిపి తరఫున అభ్యర్థుల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో వారి తరఫున ప్రచారం చేయనున్నారు. ఇప్పటివరకు ప్రాంతాలవారీగా సభలు నిర్వహించిన వైసీపీ.. ఇప్పుడు నేరుగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించబోతోంది. తద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా వైఎస్ జగన్ రంగంలోకి దిగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేస్తుంది వైసిపి. ఎన్నికలకు ముందు నుంచే అభ్యర్థులు ఎంపిక, మార్పులు చేర్పులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వరుసగా కసరత్తు చేస్తున్న సీఎం జగన్ ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి ప్రజల్లోనే ఉండేలా పర్యటనలు చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలు కోడ్ అమలులో ఉండటం మరోవైపు విపక్షాలు మొత్తం ఏకమై ఎన్నికలు సందర్భంగా విపక్షాల వ్యూహాలను చిత్తు చేసేలాగా కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటివరకు బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ మూడు ఉమ్మడిగా బరిలోకి దిగిన నేపథ్యంలో ఎలాగైనా 2019 నాటి ఫలితాన్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తూన్నారు. మరోవైపు ఉమ్మడి వేదికలపై జాతీయ నేతలతో పర్యటనలకు ప్లాన్ చేస్తున్న కూటమి పార్టీల వ్యూహాలను ఢీ కొట్టేలా జగన్ ప్రసంగాలు ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..