ఏపీ సీఎం జగన్ బుధవారం (ఏప్రిల్ 19) శ్రీకాళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల మూల పేట (గ్రీన్‌ఫీల్డ్) పోర్టు పనులకు జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో 4 బెర్తుల నిర్మాణం, జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగపడేలా రూ.4,362 కోట్ల ఖర్చుతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ పోర్టును నిర్మించనున్నారు. 30 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న సమయానికి ఇది పూర్తి చేయగలిగితే నిజంగానే ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారుతాయని అంచనా వేస్తున్నారు. పోర్టుతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో 365.81 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుండి హిర మండలం రిజర్వాయర్‌కు 176.35 కోట్ల రూపాయలతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు, 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా ఇవాళ సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక జగన్ శ్రీకాకుళం టూర్ షెడ్యూల్ విషయానికొస్తే..
బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్. ఉదయం 10.30 గంటలకు మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు ఏపీ సీఎం. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేస్తారు. ఆపై మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పనులతో పాటు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..