కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ గంట పాటు భేటీ.. పెండింగ్‌ నిధులతోపాటు ఈ 13 అంశాలే కీలకం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్ గంట పాటు భేటీ.. పెండింగ్‌ నిధులతోపాటు ఈ 13 అంశాలే కీలకం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు..

Sanjay Kasula

|

Jan 20, 2021 | 5:45 AM

CM Jagan Meets : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పలు అంశాలను సీఎం జగన్‌ అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం.

మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి 9.25 గంటల నుంచి 10.42వరకు అమిత్‌షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలపై ముఖ్యమంత్రి కార్యాలయం రాత్రి 11 గంటల సమయంలో ఓ ప్రకటన విడుదల చేసింది.

డిసెంబరు 15న ఢిల్లీకి వచ్చినప్పుడు సీఎం జగన్ మొత్తం 13 అంశాలను కేంద్ర మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మరో మూడు అంశాలను కలిపి మొత్తం 16 విషయాలపై విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఇందులో పోలవరం, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, పెండింగ్‌ నిధుల విడుదలే ప్రధానంగా ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని 55వేల 656 కోట్లుగా ఆమోదించాలని సీఎం జగన్‌ అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు కింద సేకరించాల్సిన భూమి లక్షా 2వేల 130 ఎకరాల నుంచి లక్షా 55 వేల 465 ఎకరాలకు పెరిగిందన్న ముఖ్యమంత్రి వివరించారు.

2013 భూసేకరణ, పునరావాస చట్టం కింద క్షేత్రస్థాయి సర్వే తర్వాత భూ సేకరణలో 55వేల 335 ఎకరాలగా ఫైనల్‌ చేశామన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలనుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44వేల 574 నుంచి లక్షా 6వేల6కు పెరిగిందన్న ముఖ్యమంత్రి.. డిసెంబర్‌ 2018 నుంచి చెల్లించాల్సిన 16వందల 44 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో భాజపా తన మేనిఫెస్టోలో ఉంచిందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.

అయితే..  ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌, ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జాస్తి భూషణ్‌, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పి.కృష్ణమోహన్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు ఉన్నారు. ఇక కేంద్ర మంత్రి అమిత్‌షా వద్దకు మాత్రం ముఖ్యమంత్రితో పాటు విజయసాయిరెడ్డి, ప్రవీణ్‌ప్రకాశ్ వెళ్లారు. అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వచ్చినందున న్యాయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చ సాగి ఉండొచ్చని సమాచారం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu