తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తెలంగాణలో 13,666 మందికి.. ఏపీలో 18,917 మందికి టీకాలు
దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 16 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ముందుగా ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే...
Vaccination Drive Day 4 : దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జనవరి 16 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ముందుగా ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వివరాలు ఇలా ఉన్నాయి. 4వ రోజు తెలంగాణలోని 894 సెంటర్లలో వ్యాక్సిన్ ను అందించారు.
మంగళవారం 71శాతం మందికి వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇక రాష్ట్రంలో ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్న 13,666 మందిలో చాలా కొద్ది మంది మాత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 4వ రోజు కరోనా టీకా ప్రక్రియ కొనసాగింది. మొత్తం 362 కేంద్రాల్లో 18,917 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2929 మంది వ్యాక్సిన్ తీసుకోగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 191 వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
టీకా పంపిణీ ప్రక్రియలో ప్రకాశం జిల్లాలో ఒకరు స్వల్ప అస్వస్థతకు గురి కాగా.. వైద్యులు పర్యవేక్షించినట్లు అధికారులు వివరించారు. గత మూడు రోజుల కంటే మంగళవారం వ్యాక్సినేషన్‌కు అధికంగా మంది సిబ్బంది హాజరైనట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక బుధవారం కరోనా వ్యాక్సిన్ హాలిడే కావడంతో గురువారం రోజున తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలౌతుంది.