Varupula Raja: టీడీపీ నేత అకస్మిక మరణంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాత్రి 7 గంటల వరకూ తనను కలిసేందుకు వచ్చిన సన్నిహితులు, కార్యకర్తలతో మాట్లాడారు రాజా. కాసేపటికే అస్వస్థతకు గురవడంతో వెంటనే కాకినాడ తరలించారు. హార్ట్ ఎటాక్‌తో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.

గుండెపోటు.. మరో టీడీపీ యువనేత ప్రాణం తీసింది.. ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌ఛార్జ్ వరుపుల రాజా హఠాన్మరణం ఇప్పుడు పార్టీ శ్రేణుల్ని షాక్‌కి గురి చేస్తోంది. రాజా వయసు 47 ఏళ్లే. శనివారం రాత్రి వరకూ కూడా యాక్టివ్‌గానే తిరిగిన ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కాకినాడ అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు గంటపాటు ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. రాజా మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు ప్రత్తిపాడు వెళ్లనున్నారు. రాజాకు నివాళులు అర్పించనున్నారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పలువురు టీడీపీ నేతలు కూడా వెళ్తున్నారు.
హఠాన్మరణం చెందిన టీడీపీ నేత, dccb మాజీ చైర్మన్ వరపుల రాజా అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని సీఎం జగన్ అధికారికంగా చెప్పినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబు ప్రకటించారు వరుపుల రాజా మరణం చాలా భాధాకరమన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే కన్నబాబు. రాజా మరణవార్త విని సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారని… ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ఆదేశించినట్లు కన్నబాబు తెలిపారు.
జిల్లాలో కీలకంగా ఎదుగుతున్న సమయంలో హఠాన్మరణం
1976 ఆగస్టు 14న జన్మించిన వరుపుల రాజా 2004లో మండలాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ హయాంలో డీసీసీబీ ఛైర్మన్ చేశారు. తర్వాత ఆప్కాబ్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి MLAగా పోటీ చేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో కీలక నేతగా ఎదగుతున్న దశలో హఠాన్మరణం సన్నిహితుల్ని, పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకుడిలా రాజా ఉన్నారు. 3 రోజులుగా స్థానికంగా తిరుగుతూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూ అందర్నీ సమన్వయం చేసుకునే బాధ్యత భుజాన వేసుకున్నారు.. వీకెండ్ కావడంతో శనివారం సొంత నియోజకవర్గానికి వచ్చారు. రాత్రి 7 గంటల వరకూ తనను కలిసేందుకు వచ్చిన సన్నిహితులు, కార్యకర్తలతో మాట్లాడారు. కాసేపటికే అస్వస్థతకు గురవడంతో వెంటనే కాకినాడ తరలించారు. హార్ట్ ఎటాక్‌తో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
రాజాను ముందు ఒక ఆస్పత్రికి తీసుకువెళ్లినా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ఈదారిలోనే ఆయన నొప్పితో విలవిల్లాడిపోయారు. కారు దిగిన వెంటనే కుప్పకూలిపోయారు. సీపీఆర్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండాపోయింది.
వరుపుల రాజాకు భార్య సత్యప్రభ, కుమార్తె సత్యమాధురి, కుమారుడు సాయితర్షిత్ ఉన్నారు. బీకాం వరకు చదివిన రాజా స్వస్థలం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామం. ప్రస్తుతం రాజా భౌతికకాయం ప్రత్తిపాడులోనే ఉంది. సాయంత్రం అంత్యక్రియలకు చంద్రబాబుతోపాటు పార్టీ ముఖ్యనేతలంతా వెళ్తున్నారు..
మరిన్ని ఏపీ వార్తల కోసం..
