Andhra Pradesh: అయ్యో దేవుడా.. వేడి పాలతో ఊపిరాడక చిన్నారి మృతి.. అనంతపురం జిల్లాలో విషాదం
బాబుకు పాలు తాగించాలని కుటుంబసభ్యులు వేడిచేసి, చల్లారడానికి గదిలో ఉంచారు. ఈ క్రమంలో గదిలో ఆడుకుంటున్న చిన్నారి పాల పాత్ర దగ్గరకు పాక్కుంటూ వెళ్లి పాత్రను కదిలించాడు. దీంతో వేడిపాలు బాలుడిపై పడ్డాయి. ఆ వేడిపాలు నోరు, ముక్కులోకి వెళ్లడంతో ఊపిరాడక శర్వీత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ కుటుంబంలో చిన్నారి జననం ఎంతో సంతోషాన్ని నింపింది. బాబు రాకతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిత్యం చిరునవ్వులు చిందించే శర్వీత్‌రెడ్డికి.. 15 నెలలకే నిండూనూరేళ్లు నిండటం కన్నవారిని శోకసంద్రంలోకి నెట్టింది. అభం శుభం తెలియని ఆ బాలుడిపై వేడిపాలు పడటంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో చోటు చేసుకుంది.
గుత్తి కోటలోని పోస్టాఫీసు సమీపంలో నివసిస్తున్న ప్రతాపరెడ్డి దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరైన శర్వీత్‌రెడ్డికి పాలు తాగించాలని కుటుంబసభ్యులు వేడిచేసి, చల్లారడం కోసం గదిలో ఒక పాత్రలో ఉంచారు. ఈ క్రమంలో గదిలో ఆడుకుంటున్న చిన్నారి పాల పాత్ర దగ్గరకు పాక్కుంటూ వెళ్లి పాత్రను కదిలించాడు. దీంతో వేడిపాలు బాలుడిపై పడ్డాయి. ఆ వేడిపాలు నోరు, ముక్కులోకి వెళ్లడంతో ఊపిరాడక శర్వీత్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాబు కోసం వారి రోదనలు అక్కడున్న వారందరినీ కలచివేసింది. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు, బంధువులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అభం శుభం తెలియని చిన్నారి మృతి ఆ ప్రాంతంలో విషాద వాతావరణాన్ని నింపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
