Chandrababu: ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్.. పవన్‎కు ఆ పదవి కేటాయించే అవకాశం..?

|

Jun 10, 2024 | 10:07 AM

ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. బీజేపీ,టీడీపీ,జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు.

Chandrababu: ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్.. పవన్‎కు ఆ పదవి కేటాయించే అవకాశం..?
Pawan Kalyan Chandrababu Babu
Follow us on

ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా కసరత్తు చేయనున్నారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీని క్లీన్ స్వీప్ చేసింది కూటమి. బీజేపీ,టీడీపీ,జనసేన మూడు పార్టీలు కలిసి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక భూమిక పోషించారు. తమ పార్టీ మద్దతుతో మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. అయితే నిన్నటి వరకు ఢిల్లీ ముఖ్యనేతలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు నేడు ఉండవల్లిలోని తన సొంత నివాసానికి చేరుకోనున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు.

మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కేబినెట్ కూర్పుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌తో పాటు బీజేపీ నేతలతోనూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆయన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషిచేసేందుకు సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా ఓవర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే సామాజిక సమీకరణాలు, సీనియర్లు, మహిళలతో పాటు పార్టీకి నిబద్దతగా ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ పలువురికి మంత్రి పదవి కేటాయించే ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా భారీగా ఎమ్మెల్యేలు గెలుపొందడంతో కేబినెట్ కూర్పు కత్తిమీద సాములా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అసంతృప్తులను శాంతింపజేసి, సీనియర్లకు హోదా కల్పించి, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ, అటు జనసేన, ఇటు బీజేపీ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కేబినెట్ ఎంపిక చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎవరికి ఏశాఖలు వరిస్తాయో తెలియాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..