JEE Advanced 2024 Toppers List: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. తొలి వంద ర్యాంకుల్లో 20 మనవే

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. టాప్‌ -10 ర్యాంకుల్లో మూడు తెలంగాణ, నలుగురు ఏపీ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి..

JEE Advanced 2024 Toppers List: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. తొలి వంద ర్యాంకుల్లో 20 మనవే
JEE Advanced 2024 Toppers List
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2024 | 9:25 AM

హైదరాబాద్‌, జూన్‌ 10: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. టాప్‌ -10 ర్యాంకుల్లో మూడు తెలంగాణ, నలుగురు ఏపీ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 వేల మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. హైదరాబాద్‌ విద్యార్థి బీ సందేశ్‌ ఆలిండియా మూడోర్యాంకుతో అదరగొట్టాడు. ఇక పుట్టి కుశాల్‌కుమార్‌ ఐదోర్యాంకు, ఎస్‌ఎస్‌డీబీ సిద్ధిక్‌ పదో ర్యాంకుతో సత్తాచాటారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్‌ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్‌ కుమార్‌ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్‌ సుహాస్‌ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 360 మార్కులకు గానూ 355 మార్కులతో సత్తా చాటాడు.

ఆలిండియా టాప్‌ -10లో ఐఐటీ మద్రాస్‌ జోన్‌ నుంచి నలుగురు విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. దీంట్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులుండటం విశేషం. మద్రాస్‌ జోన్‌ నుంచి టాప్‌ -100లో 9, టాప్‌ -200లో 13, టాప్‌ -300లో 27, టాప్‌ -400లో 38, టాప్‌ -500లో 48 మంది విద్యార్థులున్నారు. మద్రాస్‌ జోన్‌ నుంచి మొత్తంగా 5,136 మంది క్వాలిఫై అయ్యారు. తెలంగాణ విద్యార్థి శ్రీనిత్య దేవరాజ్‌ 268 మార్కులతో మద్రాస్‌ జోన్‌ మహిళా టాపర్‌గా నిలిచింది.

కాగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు1,86,584 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, వారిలో 1,80,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 48,248 మంది క్వాలిఫై అయ్యారు. 2023లో 43,773 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. దీంతో ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లైంది. ఈ ఏడాది క్వాలిఫై మార్కులు కూడా పెరిగాయి. గతేడాది జనరల్‌ ర్యాంకు కటాఫ్‌ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్‌ 98, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 54గా కటాఫ్‌ నిర్ణయించారు. ఈ ఏడాది మొత్తం అబ్బాయిలు 1,43,637 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 40,284 మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 42,947 మంది దరఖాస్తు చేసుకుంటే, 41,020 మంది హాజరయ్యారు. వీరిలో 7,964 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు 14 వేల మంది, ఎస్సీ క్యాటగిరీలో 13వేల మంది, ఓబీసీ కేటగిరీలో 9వేల మంది క్వాలిఫై అయ్యారు.

ఇవి కూడా చదవండి

క్యాటగిరీ వారీగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో క్వాలిఫై అయిన విద్యార్ధుల వివరాలు

  • జనరల్‌ క్యాటగిరీ: 14,083 మంది
  • జనరల్‌ పీడబ్ల్యూడీ క్యాటగిరీ: 236 మంది
  • ఓబీసీ ఎన్‌సీఎల్‌ క్యాటగిరీ: 9,281 మంది
  • ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాటగిరీ: 218 మంది
  • జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ క్యాటగిరీ: 5,423 మంది
  • ఈడబ్ల్యూఎస్‌ పీడబ్ల్యూడీ క్యాటగిరీ: 85 మంది
  • ఎస్సీ క్యాటగిరీ: 13,794 మంది
  • ఎస్సీ పీడబ్ల్యూడీ క్యాటగిరీ: 41 మంది
  • ఎస్టీ క్యాటగిరీ: 5,073 మంది
  • ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాటగిరీ: 14 మంది

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.