Kuppam: కుప్పంలో టీడీపీ కొత్త వ్యూహం.. వైసీపీ స్పీడ్‌కు చెక్ పెట్టే దిశగా చంద్రబాబు కీలక నిర్ణయం..

చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పంలో పార్టీ బలోపేతానికి  కొత్త స్ట్రాటజీని అమలు చేస్తోంది. అధికార వైసీపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహం పన్నుతోంది. స్థానిక ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పంకు దూరంగా ఉండటంతో కుప్పంపై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు టీడీపీ అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటో చూద్దాం..

Kuppam: కుప్పంలో టీడీపీ కొత్త వ్యూహం.. వైసీపీ స్పీడ్‌కు చెక్ పెట్టే దిశగా చంద్రబాబు కీలక నిర్ణయం..
Chandrababu Naidu (File Photo)
Follow us

|

Updated on: Jun 02, 2023 | 4:32 PM

కుప్పం.. ఏపీ రాజకీయాల్లో కీలక నియోజక వర్గం. టీడీపీ అధినేత చంద్రబాబు వరుస విజయాలతో అసెంబ్లీకి ఎన్నికవుతున్న కుప్పంలో 2019 ఎన్నికల తర్వాత వైసీపీ దూకుడు పెంచడం సైకిల్‌ను ఇబ్బంది పెట్టిస్తూ వచ్చింది. ఈ నేపధ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చంద్రబాబును కూడా కలవర పెట్టించాయి. 1989 నుంచి ఎమ్మెల్యేగా పట్టం కడుతున్న కుప్పం ఓటర్ల కోపం ఎవరిపైనని తెలుసుకునేందుకు చంద్రబాబు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీపై పోస్టు మార్టం నిర్వహించారు. కింది స్థాయి నాయకుల్లో ఉన్న అసంతృప్తి, పార్టీలో పాతుకుపోయిన కొందరు మండలానికో నేత డిక్టేటర్లుగా మారిపోయారని గుర్తించిన చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు. కొందరి చేతిలోనే పార్టీ వ్యవహారాలు నడుస్తూ రావడంతో అక్కడ జరిగిన పొరపాట్లను గుర్తించే లోపే కుప్పం నియోజకవర్గంలో గత మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీకి అధికార వైసీపీ షాక్‌ల మీద షాక్‌లను ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కుప్పం నియోజక వర్గంలో క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ ఢీలా పడింది. చంద్రబాబు పని అయిపోయిందన్న ప్రచారాన్ని వైసీపీ రాష్ట్రమంతా విపించేలా చేసింది. వై నాట్ 175 అంటూ ఏకంగా సీఎం నుంచి ఆ నినాదాన్ని వినిపించిన వైసీపీ.. కుప్పంలో జై జగన్ నినాదం మారుమోగేలా చేసింది. దీంతో ఒకానొక సందర్భంలో కుప్పంలో టీడీపీ డిఫెన్స్‌లో పడిపోయిందన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపించింది. దీంతో అలెర్ట్ అయిన చంద్రబాబు కుప్పం పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.

లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం..

2019 ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత వచ్చిన లోకల్ రిజల్ట్స్ ను టిడిపి జీర్ణించుకోలేకపోతోంది. 2024 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న టిడిపి పార్టీ కేడర్ ను సిద్దం చేసేందుకు పక్కా ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తోంది. లక్ష ఓట్ల మెజార్టీయే కుప్పంలో టిడిపి లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే గత మార్చిలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కు కుప్పం బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్యేగా చంద్రబాబు కొనసాగుతున్నా పార్టీ జాతీయ అద్యక్షుడిగా కుప్పంకు అందుబాటులో ఉండని పరిస్థితులతో కంచర్ల శ్రీకాంత్ ను కుప్పం కేడర్ కు అందుబాటులో ఉంచడంతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రొటోకాల్ అవకాశం కూడా దక్కేలా చేసింది. కుప్పం మున్సిపాలిటీలో కో ఆప్షన్ మెంబర్ స్థానిక టీడీపీ ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ కు చోటు దక్కడం వల్ల కుప్పంలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, అభివృద్ధిపై నిలదీసేందుకు సమయం దొరుకుతుందన్న భావనలో టీడీపీ ఉంది. ఇందులో భాగంగానే స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ రామాచార్యుల ఆదేశాలు, జీఏడీ నుంచి ప్రొటోకాల్ కల్పిస్తూ ఉత్తర్వులు కూడా జిల్లా యంత్రాంగానికి చేరాయి.

Kuppam Tdp

TDP MLC Kancharla Srikanth (File Photo)

ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అధికార యంత్రాంగంపై పట్టుకోసం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు పట్టం కట్టిన టీడీపీ హైకమాండ్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. మరోవైపు కుప్పం టీడీపీలోని సీనియర్లతో విసిగి పోయిన కేడర్ కు కొత్త నాయకుడిని పరిచయం చేయడం ద్వారా ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉన్న అసంతృప్తిని తగ్గించే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పంకు మకాం మార్చేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఒకవైపు పార్టీలోని సీనియర్లకు చెక్ పెట్టి యువతను పార్టీ దగ్గరకు చేరదీసేందుకు దోహదపడుతుందని కొందరు టీడీపీ నియోజకవర్గ నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. కుప్పంలో పార్టీని బలోపేతం చేసే స్ట్రాటజీలో భాగంగా పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

-MPR రాజు, టీవీ9 తెలుగు, తిరుపతి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..