Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం 9.30 నుంచి రెండో రోజు చంద్రబాబు విచారణ ప్రారంభమైంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయ నేతృత్వంలో 12 మంది సిబ్బంది సమక్షంలో విచారణ జరుగుతోంది. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత న్యాయవాదుల సమక్షంలో విచారణను కొనసాగిస్తున్నారు. రెండో రోజు విచారణ గంటసేపు పూర్తి కావడంతో చంద్రబాబుకు 5 నిమిషాల బ్రేక్ ఇచ్చారు. ఈ గంట సేపటిలో సీఐడీ బృందం పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆర్థిక లావాదేవీలపై విచారిస్తున్నట్లు సమాచారం. కిలారి రాజేష్ పాత్రపై, 118 కోట్ల నిధులు పీఎస్ శ్రీనివాస్ ద్వారా మళ్ళించారా..? అనే దానిపై విచారించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా పరారీలో ఉన్న నాలుగురు కీలక వ్యక్తుల గురించి కూడా ఆరాతీస్తున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం ఎప్పటిలానే నిబంధనల ప్రకారమే అన్ని జరిగాయంటూ సమాధానమిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబును ప్రశ్నించేందుకు 30 అంశాలలో 120 ప్రశ్నలను రెడీ చేసుకున్న సీఐడీ.. మొదటి రోజు 50 ప్రశ్నలను మాత్రమే సంధించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో పాతవాటితోపాటు మిగతా కొత్త ప్రశ్నలను కూడా సంధించి, జవాబులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కస్టడీ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో బాబును హాజరుపరచనున్నారు. ఒకవేళ చంద్రబాబు విచారణకు పూర్తిస్థాయిలో సహకరించకపోతే కస్టడీని పొడిగించాలని సీఐడీ కోర్ట్‌ను కోరే అవకాశం ఉంది. ఇక ఈ రెండు రోజుల విచారణపై కూడా సీఐడీ సీల్డ్ కవర్‌లో ఏసీబీ కోర్ట్‌కు రిపోర్ట్ ఇవ్వనుంది.
ఇదిలాఉంటే.. చంద్రబాబు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా ఆక్టోపస్ బలగాలను మోహరించారు. అంతేకాకుండా రాజమండ్రిలో నారా లోకేష్ క్యాంప్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. ఐటీ ఉద్యోగుల ఛలో రాజమండ్రి పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లోకేష్ క్యాంప్ ఆఫీసు చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజమండ్రి వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఐటీ ఉద్యోగుల ర్యాలీ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాలను పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం.. ప్రయాణికులను ఏపీలోకి అనుమతిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చిన ర్యాలీకి అనుమతి లేదని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెక్ పోస్టులున్న ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది.
చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరుపున నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అభియోగాలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. లోకేష్ యువగళం తిరిగి ప్రారంభంపైనా ముఖ్యనేతల సమావేశంలో చర్చించారు. వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నట్లు లోకేష్ వివరించారు. పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నారు. చంద్రబాబు పై కేసు విషయంలో ఢిల్లీలో ఉండి లోకేష్ న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నారు. లీగల్ ఫైట్ కొనసాగిస్తూ.. యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ ,ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..