AP Elections: కౌంటింగ్‌పై స్పెషల్ ఫోకస్.. ఫ్యాక్షన్ నాయకులపై ఈసీ యాక్షన్ ప్లాన్ ఇదే..
ఏపీలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై స్పెషల్ ఫోకస్‌పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ అనంతరం భారీగా హింస చెలరేగిన నేపథ్యంలో ఏపీ కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. హింసాత్మక ఘటనలకు ఈసీ వైఫల్యమే కారణమని విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో.. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భద్రతను పెంచింది. దాదాపు 20 కంపెనీల బలగాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది.

ఏపీలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ అనంతరం భారీగా హింస చెలరేగిన నేపథ్యంలో ఏపీ కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. హింసాత్మక ఘటనలకు ఈసీ వైఫల్యమే కారణమని విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో.. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా భద్రతను పెంచింది. దాదాపు 20 కంపెనీల బలగాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత ఘర్షణల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ. పలువురు నేతల్ని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకూడదని ఆదేశాలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమికూడే అవకాశం లేకుండా.. 144 సెక్షన్ విధించారు. అలాగే సోషల్ మీడియాపై కూడా కన్నేసి ఉంచారు అధికారులు. అలాగే విజయోత్సవాలు, సంబరాలపై కూడా ఆంక్షలు విధించింది ఈసీ.
పోలింగ్ ఫ్యాక్షన్‌ను దృష్టిని పెట్టుకుని.. కౌంటింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాక్షన్ స్టార్ట్ చేశారు పోలీసులు. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివార్లు, నేరస్తుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల అనంతరం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో తాడిపత్రి కూడా ఉంది. స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య పెద్ద ఎత్తన ఘర్షణలు జరిగాయి. కౌంటింగ్ రోజు ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలను గృహ నిర్భందంలో ఉంచారు. వారి ఇంటి చుట్టూ ముళ్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అలాగే వారి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇద్దరు నేతల ఇళ్లచుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.
ఏపీవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా ఏపీ డీజీపీ హరీష్ గుప్తా, సీఈవో ముఖేష్ కుమార్ మీనా పల్నాడులో పర్యటించారు. కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఎస్పీ, కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఇక స్ట్రాంగ్ రూముల భద్రతతో పాటు కౌంటింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేలా ఎన్నికల కమిషన్ పక్కాగా ముందుకు వెళ్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




