YS Viveka: వివేకా హత్య కేసులో తండ్రీకుమారులకు సీబీఐ నోటీసులు.. ఒక రోజు వ్యవధిలో విచారణకు హాజరు కావాలని పిలుపు..

|

Feb 19, 2023 | 8:44 AM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు పలు టర్న్ లు తీసుకుంటోంది. తాజాగా.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు పంపించింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 24న మధ్యాహ్నం..

YS Viveka: వివేకా హత్య కేసులో తండ్రీకుమారులకు సీబీఐ నోటీసులు.. ఒక రోజు వ్యవధిలో విచారణకు హాజరు కావాలని పిలుపు..
Ys Viveka Murder Case
Follow us on

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు పలు టర్న్ లు తీసుకుంటోంది. తాజాగా.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు పంపించింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో, భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న పులివెందులలో విచారిస్తామని నోటీసుల్లో పేర్కొంది. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరు కాలేనంటూ భాస్కర్‌రెడ్డి సమయం కోరినట్లు సమాచారం. కాగా.. గతంలో సీబీఐ అధికారులు సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు నోటీసు ఇచ్చారు. గత నెల 28న విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఒక్కరోజు వ్యవధిలోనే తండ్రీకుమారులను విచారణకు సీబీఐ పిలవడం చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరారు. మరోవైపు.. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఫిబ్రవరి 16న తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్‌ దాఖలు చేశారు. 2019, మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి నేర అభియోగ పత్రాలు దాఖలు చేసిందని.. సీబీఐ అధికారులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారని వివేకా భార్య పేర్కొన్నారు.

కాగా.. వైఎస్ వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పులివెందులకు చెందిన సునీల్ ను సీబీఐ 2021 ఆగస్టులో గోవాలో అరెస్టు చేసింది. గతంలో సునీల్ యాదవ్ కు బెయిల్ ఇచ్చేందుకు కడప జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టు నిరాకరించాయి. అనంతరం సుప్రీంకోర్టు వైఎస్ వివేకా హత్య కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..