AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BJP: ఏపీ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు.. ఢిల్లీ వెళ్లిన కన్నా.. ఎందుకంటే..?

Andhra Pradesh BJP: హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం రాష్ట్ర బీజేపీలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు.. అధికార పార్టీపై పోరాడటంలో

AP BJP: ఏపీ బీజేపీ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు.. ఢిల్లీ వెళ్లిన కన్నా.. ఎందుకంటే..?
Kanna Lakshminarayana
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2021 | 5:04 PM

Share

Andhra Pradesh BJP: హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం రాష్ట్ర బీజేపీలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు.. అధికార పార్టీపై పోరాడటంలో వెనకపడిందన్న ఆరోపణలు అమిత్ షా వ్యాఖ్యలతో బహిర్గతమైంది. ముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్రను పార్టీ సరిగా ఉపయోగించుకోలేదన్న అభిప్రాయాన్ని హోంమంత్రి వ్యక్తం చేయడం వెనువెంటనే బీజేపీ నేతలు రైతుల పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే అదే స్థాయిలో పార్టీ.. ప్రభుత్వ విధానాలపై పోరాడటం లేదన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఓటిఎస్, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, అన్నమయ్య ప్రాజెక్టు లాంటి కీలక అంశాల్లో సైతం బీజేపీ సరిగా పోరాడలేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ పనితీరుపై అధిష్టానం దృష్టి సారించింది. అమిత్ షా కూడా వారం వారం నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను కో ఆర్డినేట్ చేయటానికి పదహారు మంది కమిటీని సైతం వేశారు. మరోవైపు కన్నా లక్ష్మీ నారాయణకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఈ క్రమంలో పార్టీ విస్తరణపై బీజేపీ అధిష్టానం దృష్టిసారించింది.

దీనిలో భాగంగా.. బీజేపీ అధిష్టానం ఈ రోజు ఏపీ ముఖ్య నేతల్ని మరోసారి ఢిల్లీకి పిలిచింది. కన్నా, పురంధేశ్వరితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీకి పిలిచారు. అయితే వ్యక్తిగత కారణాలతో సోము వీర్రాజు ఢిల్లి పర్యటన వాయిదా వేసుకున్నారు. సత్య కుమార్, పురంధేశ్వరి, కన్నా, సీఎం రమేష్, సుజనా చౌదరిలతో పార్టీ ముఖ్యులు ఈ రోజు, రేపు రాష్ట్ర పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. ఇదే సమయంలో ప్రధాని ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్ర ముఖ్య నేతలతో కేంద్ర పెద్దల వరుస భేటీలు.. రాష్ట్రంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే దిశగా ఉంటాయనే ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. అధిష్టానం పిలుపుతో.. ఏపీ బీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి.. వాటి వల్ల పార్టీకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందోనని ఆ పార్టీ కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు.

Also Read:

ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు..

AP Government: పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం.. వచ్చే నెల నుంచి వృద్దాప్య పెన్షన్ పెంపు.!