సామాన్యుల ఇంట్లో చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు, కానీ అదే పోలీసుల ఇంట్లోనే దొంగతనం జరిగితే..? ఎవరూ లేని వేళ సీఐ ఇంట్లోనే చోరీ చేశారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంగలు. శ్రీకాకుళంలో అవినీతి నిరోధక శాఖ సీఐగా విధుల నిర్వర్తిస్తున్న హరి శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల 3న సారవకోటకు వెళ్లిన హరి ఊరికి వెళ్లే ముందు పెరట్లోని గ్రిల్స్‌కి తాళం వేయడం మరిచిపోయాడు. గ్రిల్ డోర్స్ కూడా సరిగ్గా వేయకపోవడంతో అదే అవకాశంగా సదరు అధికారి ఇంట్లోకే చొరబడ్డారు దొంగలు.
లోపలికి వెళ్లగానే బెడ్ రూంలో బీరువా తాళాలు కనిపించడంతో వాళ్ల పంట పండిందనుకున్నారు. అవకాశం పోతే మళ్లీ రాాదు అనుకున్నారేమో దొరికినదంతా దోచేసుకున్నారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చిన హరికి ఇంటి పెరట్లోని తలుపులు తీసి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్లి చూసిన ఆయనకు తన ఇంట్లో చోరీ జరిగిందని అర్థమైంది. ఆ వెంటనే క్లూ టీమ్‌కి సమాచారం అందించగా.. వారు వచ్చి వేలిముద్రలు, తదితర ఆనవాళ్లు సేకరించారు.
కాగా, తన ఇంట్లోని ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు సీఐ హరి ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు ఒడిశాకు చెందిన వ్యక్తులే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు జాగ్రత్తగా తాళం వేసుకున్నారో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.