AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అనుమానాస్పదంగా కనిపించిన బీటెక్ స్టూడెంట్.. ఆపి అతడి బ్యాగ్ చెక్ చేయగా

ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనుకున్నాడు ఓ యువకుడు. అనుకున్నట్లే అతడు బీటెక్ చదివాడు. పోటీ పరీక్షలు రాసినా జాబ్ మాత్రం రాలేదు. జల్సాలు, బెట్టింగులకు బానిస అయ్యాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈజీ మనీ కోసం ఆ యువకుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Andhra: అనుమానాస్పదంగా కనిపించిన బీటెక్ స్టూడెంట్.. ఆపి అతడి బ్యాగ్ చెక్ చేయగా
Representative Image
M Revan Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 12, 2025 | 9:36 AM

Share

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన పెనుగొండ మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. జల్సాలకు అలవాటు పడి.. విలాసవంతమైన జీవితం గడపాలని భావించాడు. ఈజీ మనీ కోసం మల్లికార్జున్ రెడ్డి అడ్డదారులు తొక్కాడు. దొంగగా మారి తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసేవాడు. దొంగతనంతో వచ్చిన సొమ్మును విక్రయించి బెట్టింగ్ ఆడుతూ పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారంలో దొంగతనానికి పాల్పడ్డాడు. గ్రామంలోని ముడెం గోపిరెడ్డి ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మల్లికార్జున్ రెడ్డి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు దొంగిలించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుజూర్‌నగర్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

వేపలసింగారంలో దొంగిలించిన బంగారాన్ని కరగబోసి వాటిని విక్రయించేందుకు మల్లికార్జున్ రెడ్డి మిర్యాలగూడకు వెళ్తున్నాడు. ఇదే సమయంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో మల్లికార్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు, సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి నగదు, బంగారాన్ని దొంగిలించినట్లు మల్లికార్జున్ రెడ్డి అంగీకరించాడు. బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో లగ్జరీ లైఫ్ కోసం మల్లికార్జున్ రెడ్డి దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బుతో బెట్టింగ్‌లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడని సీఐ చరమందరాజు తెలిపారు. నేరస్థుడి వద్ద నుంచి 51.78 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,85,000 నగదు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.