మత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండుగ గురించి ఎప్పుడైనా విన్నారా ?. అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పండగ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అక్కడకు భక్తులు క్యూ కడుతుంటారు. అలా అని నిత్యం అక్కడ ఈ పండుగలు జరగవు. ఏడాదిలో ఐదు రోజులు మాత్రమే ఈ వేడుకలు జరుగుతుంటాయి. రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయా… అంటే అవుననే అంటున్నారు అక్కడి భక్తులు. కోరిన కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకునే వారు కొందరైతే… కోరిక తీరిన తర్వాత రొట్టె వదిలే వారు మరి కొందరు. ఇదేదో ఒక ప్రాంతానికి పరిమితమైన రొట్టెల పండుగ కాదు.. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు అక్కడికి వస్తారు. భక్తివిశ్వాలతో అమరవీరుల సమాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటారు.
మతసామరస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రొట్టెల పండుగ నెల్లూరు లో ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పండుగ విశేషాలు ఓ సారి చూద్దాం. మతసామరస్యానికి ప్రతీకగా అయిన ఆ పండుగను.. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి ఆ మతం, ఈ మతం అని తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి కోరిన కోర్కెల రొట్టెలు మార్చుకోవడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, వివాహ రొట్టె ఇలా 12 రకాల కోర్కెలకు సంబంధించిన రొట్టెలు అక్కడ ప్రత్యేకం. గతంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కూడా రొట్టెల పండగకి వచ్చి రొట్టెలు స్వీకరించారు. ఈ ఏడాది భారీ ఏర్పాట్లతో అత్యంత వేడుకగా రొట్టెల పండగ నిర్వహించాలని అధికారులు సిద్ధమయ్యారు. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రులు కూడా రొట్టెల పండుగకు వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రొట్టెలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
అసలు నెల్లూరులో రొట్టెల పండుగ ఎలా మొదలైంది
ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దు పోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారాషహీద్‌లు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది.. సమాధుల పక్కనున్న మట్టిని తీసుకెళ్ళి ఆమె నుదిటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఉదయాన్నే భార్యభర్తలిద్దరు గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది ఆమెకు సరైన వైద్యం చేసినవారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేయిస్తుంటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్ధానంలో వున్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది.
దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలసి నెల్లూరులోని స్వర్ణాల చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషహీదులకు ప్రార్థనలు చేసి, తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారం రొట్టెల మార్పు జరుగుతోంది. కోర్కెలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోర్కెలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడం అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటుండంతో ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటున్నారు.
నెల్లూరు నగరంలోని భారా షాహిద్ దర్గా రొట్టెల పండగ కోసం సిద్ధం అయింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండగకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వర్ణాల చెరువును విద్యుద్దీపాలతో అలంకరించారు. దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శుక్రవారం నుంచి ఐదు రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే ఆగస్టు మూడవ తేదీ వరకు ఈ పండుగ జరగనుంది. ఈ వేడుకలో గంధ మహోత్సవం ఎంతో ప్రత్యేకమైంది. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని కలుపుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ కడప దర్గా పీఠాధిపతి చేతుల మీదుగా ప్రార్థనలతో అమరవీరుల సమాధులకు లేపనం చేస్తారు.. దీన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.