Brain Dead: గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ కేసు నమోదైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కోటేశ్వరరావు అనే యువకుడు గత ఆదివారం ఓ పెళ్లికి వెల్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలైన కోటేశ్వరరావును అదే రోజు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు మంగళవారం బ్రెయిన్ డెడ్ కేసుగా నిర్థారించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం చేయవచ్చని, మీరిచ్చే అవయవ దానంతో మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వొచ్చని వైద్యులు అతని కుటుంబానికి సూచించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు. జీవనధార పథకం ద్వారా అవయవాలను తరలించేందుకు సిద్ధమయ్యారు. కోటీశ్వరరావు గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కళ్లను ఎవరెవరికి ఇవ్వాలో నిర్ణయించారు. దాని ప్రకారం అవయవాలను సేకరించి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు పంపించారు. అక్కడి నుంచి వాటిని చెన్నై, కర్నూలుతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించారు. కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయంతో మరో ఎనిమిది మందికి జీవితాన్ని ఇచ్చారని ఎన్ఆర్ఐ ఆసుపత్రి సీఈవో వెంకట్ అన్నారు. (Tv9 రిపోర్టర్ నాగరాజు)
ఇవీ చదవండి..