Tirumala Laddu: దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి.. ఏపీ సర్కార్‌కు బొత్స సవాల్
సీఎం చంద్రబాబు మాటలతో వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ కొరడం లేదని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు మాటలతో వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వార్ధ రాజకీయాలు కోసం సీఎం చంద్రబాబు లడ్డూపై గందరగోళం సృష్టించినట్లు చెప్పారు. ప్రసాదంపై చంద్రబాబు మాటలను చూసి తనకు జాలేస్తుందని చెప్పారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మాజీ సీఎం జగన్ తిరుపతికి వెళ్తే అడ్డుకున్నారని మండిపడ్డారు. మళ్లీ ఎవరు నోటీసులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. లడ్డు కల్తీ జరిగిందా లేదా అని స్వామీజీలు చంద్రబాబు ఇంటి దగ్గర ధర్నా చేయాలన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు ఎందుకు సీబీఐ విచారణ కొరడం లేదని ప్రశ్నించారు.
జగన్‌ను తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడానికి కుట్ర చేసి పక్క రాష్ట్రల నుంచి జనాలను తీసుకువచ్చారని బొత్స పేర్కొన్నారు. లడ్డు వివాదంపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు చేసింది తప్పు కాబట్టే హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐకి విచారణ జరిపించాలని లేఖ రాయలేకపోతున్నట్లు చెప్పారు. సామాన్య భక్తులు ఇబ్బంది పడతారని తిరుపతి పర్యటనపై జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో 4 వేల మంది కార్మికులను తొలగిస్తే దానికి సమాధానం చెప్పే వారు లేరన్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 వేల కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో బాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో రాజకీయం చేయడం ధర్మమేనా? అని, దమ్ము ధైర్యం ఉంటే సుప్రీం కోర్టు, హైకోర్టు, సీబీఐలతో విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయవద్దని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు.