AP News: మాజీ మంత్రి శిద్దా ఇంటి ముందు కనిపించిన లేఖ.. అందులో రాసింది చదివి గుండెలు గుభేల్
ఎన్నికల వేళ శిద్దాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మొన్న చోరీయత్నం.. నిన్న బెదిరింపులు శిద్దాను కలవరపెడుతున్నాయి. ఇంట్లో బాంబ్ అంటూ వదిలిన లేఖ భయభ్రాంతులకు గురిచేసింది. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి....
మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి బాంబు బెదిరింపు రావడం ఉలిక్కిపడేలా చేసింది. ఒంగోలులోని శిద్దా రాఘవరావు నివాసంలో రెండు బాంబులు పెట్టామంటూ ఆయన ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు లేఖ విసిరేసి వెళ్లాడు. ఇంట్లో పెట్టిన బాంబులు తీసేయాలంటే.. 7 కోట్లు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన శిద్ధా రాఘవరావు ఇంట్లో సోదాలు చేశారు. ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు లేఖ విసిరిన వ్యక్తి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాత నిందితులే ఇప్పుడూ డబ్బు కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఇటీవలే శిద్దా రాఘవరావు ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు దొంగలు. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల సమయంలో గోడదూకి ఇద్దరు దొంగలు శిద్దా రాఘవరావు ఇంట్లోకి ప్రవేశించారు. కింద పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న వరండాలోకి ప్రవేశించారు. సెల్‌లో మునిగిపోయిన వాచ్‌మెన్‌పై ఎటాక్ చేశారు. కత్తితో బెదిరించి నోరు నొక్కిపెట్టారు. వాచ్‌మెన్ పెనుగులాడే క్రమంలో కుర్చీ నుంచి కిందపడిపోయాడు. వాచ్‌మెన్ పెద్దగా కేకలు వేయడంతో అక్కడే పడుకుని ఉన్న గన్‌మెన్ నిద్ర లేచాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు.
దొంగతనం ఘటన మరువక ముందే మళ్లీ ఇలా బెదిరింపులు రావడం శిద్దా కుటుంబాన్ని భయపెడుతోంది. వరుస సంఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. శిద్ధా కుటుంబానికి ఎవరైనా హాని తలపెట్టారా అన్న చర్చ సాగుతోంది. శిద్ధాకు బెదిరింపుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. నిందితుడిని క్షణాల్లో పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఎవరైనా కావాలనే ఇదంతా చేస్తున్నారా ? లేదా పోకిరీ బ్యాచ్ పని అయ్యి ఉంటుందా అన్నది ఆరా తీస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడనుంది.
ప్రకాశం జిల్లాలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దర్శికి పేరు. ఈ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శిద్దా రాఘవరావు మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి దర్శి బరిలో దిగాలని భావించినా సాధ్యపడలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..