ప్రేమలు, ప్రేమ వివాహాలు ఇప్పుడు కామనే కానీ.. ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా లేకుంటే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది.. జైలులో చిప్పకూడు తినాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ ఘనడికి ఇదేరకమైన అనుభవం ఎదురయ్యింది. ప్రేమ అంటూ రెచ్చిపోయి చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికతో తనకు పెళ్లి చేయాలని బెదిరింపులకు దిగాడు ఆ ఘనుడు. బొబ్బిలి గొల్లపల్లి దాడితల్లి కాలనీకి చెందిన సింగారు అజయ్ అనే యువకుడు డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే సీతానగరంకు చెందిన ఓ మైనర్ బాలికను స్కూల్ కి వెళ్తుండగా చూశాడు. పలుమార్లు ప్రేమిస్తున్నానంటూ ఆ అమ్మాయి వెంటపడ్డాడు. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానంటూ బాలిక తల్లిదండ్రులు వద్దకు వెళ్లి అడిగాడు. అయితే అందుకు బాలిక తల్లిదండ్రులు నిరాకరించారు. తమ కుమార్తె ఇంకా చిన్న అమ్మాయి అని ఇప్పుడే పెళ్లి చేయటం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో కొద్దిరోజులు బాలిక వెంటపడటం మానేశాడు అజయ్.
హమ్మయ్య.. అంతా సద్దుమణిగిందని బాలిక తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. అయితే ఇంతలోనే అజయ్ బొబ్బిలిలోనే ఓ సెల్ టవర్ ఎక్కి బాలికతో తనకు వివాహం చేయాలని లేకపోతే సెల్ టవర్ పై నుండి దూకి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్ ని సెల్ టవర్ పై నుండి క్రిందకి దిగాలని కోరారు. అయితే అందుకు అజయ్ బాలికను తనకిచ్చి పెళ్లి చేస్తేనే కిందకు దిగుతాను అంటూ బెదిరింపులకు దిగాడు. ఎలాగైనా అజయ్ ను కిందకి దించాలని భావించిన పోలీసులు.. బాలికతో పెళ్లి చేస్తామని మాట ఇచ్చారు. అయితే అజయ్ మాత్రం పోలీసుల మాట వినలేదు. బాలిక నేరుగా వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్తే తప్ప సెల్ టవర్ పై నుండి క్రిందకు దిగనని డిమాండ్ చేశాడు.
దీంతో చేసేదిలేక పోలీసులు బాలికను పిలిపించి పెళ్లి చేసుకుంటానని క్రిందకి దిగాలని చెప్పించారు. దీంతో బాలిక మాటలు నమ్మిన అజయ్ సెల్ టవర్ పై నుండి కిందకు దిగాడు. వెంటనే అజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించినందకు ఫోక్సో కేసు నమోదు చేసి కటకటాలకు పంపించారు. చట్టాల పై అవగాహన లేక మైనర్ బాలికను ప్రేమించడంతో జైలు పాలయ్యాడు అజయ్. ప్రేమ పేరుతో బెదిరింపులకు పాల్పడడం, వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.