Andhra: కృష్ణానదిలో ఊపిరిబిగపట్టే సీన్.. వరదకు కొట్టుకొచ్చిన భారీ బోటు.. సీన్ కట్ చేస్తే.!

కృష్ణానది ఉధృతిలో మరోసారి ఊపిరి బిగపట్టే ఘటన చోటుచేసుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహంలో కొట్టుకువస్తున్న బోటు ప్రకాశం బ్యారేజ్ దిశగా చేరుతుండగా, అధికారులు సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారు. డ్రోన్ల సాంకేతిక సహాయంతో విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమై, ఎస్డిఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Andhra: కృష్ణానదిలో ఊపిరిబిగపట్టే సీన్.. వరదకు కొట్టుకొచ్చిన భారీ బోటు.. సీన్ కట్ చేస్తే.!
Vijayawada

Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2025 | 12:32 PM

కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల నుంచి ఒక బోటు ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లు సమాచారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్‌కు చేరింది. వెంటనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ స్వయంగా స్పందించారు. SDRF బృందం, డ్రోన్ యూనిట్‌లతో సమన్వయం చేసుకుని ఆపరేషన్ ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో నదిని స్కాన్ చేస్తూ తుమ్మలపాలెం సమీపంలో ఆ బోటును గుర్తించారు. SDRF, గజ ఈతగాళ్లు అతి తక్కువ సమయంలో అక్కడకు చేరుకుని బోటును ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర భారీ ప్రమాదం తప్పింది. ప్రవాహం ఉధృతిగా ఉన్న సమయంలో బోటు ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొడితే గేట్లకు నష్టం జరిగే అవకాశం ఉండేది.

నది ఉధృతిలో ఇలాంటి సంఘటనలు గేట్ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు గుర్తుచేశారు. గత సంవత్సరం బుడమేరు వరదల్లో ఇలాంటి సంఘటన కారణంగా గేట్లలో చిక్కుకున్న బోటును తొలగించేందుకు ఎనిమిది రోజులు పట్టిన విషయం అందరికీ గుర్తుంది. టెక్నాలజీ వినియోగం ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. సీఎం చంద్రబాబు దార్శనికతతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ వ్యవస్థ ఆధునిక టెక్నాలజీతో సిద్ధమవుతోంది. డ్రోన్లు, రియల్‌టైమ్ మానిటరింగ్, జియో ట్యాగింగ్ వంటి సాంకేతిక పద్ధతులు విపత్తుల సమయంలో సకాలంలో చర్యలు తీసుకునేలా సహాయపడుతున్నాయి.