ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి.. తొలిసారి పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరన్, జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై నేతలకు పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు. గత నాలుగేళ్ళుగా జరిగిన పరిణామాలను మరోసారి సమావేశంలో విశ్లేషించారు.
పార్టీలో గ్రూపు తగాదాలకు అవకాశం ఇవ్వొద్దని.. ఏదైనా ఉంటే పార్టీ వేదికల మీదే మాట్లాడాలని సూచించారు. ఇకపై వేరే వారి బలం ఆధారంగా కాకుండా సొంత బలం మీదే రాజకీయం ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తులపై ఎవ్వరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని నేతలకు సూచించారు. పొత్తులపై ఏదన్నా మాట్లాడాలంటే జాతీయ పార్టీనే మాట్లాడుతుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. మిత్రపక్షంగా ఉన్న జనసేనతో కలిసి కార్యక్రమాలు చేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 18వ తేదీన ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్-పురంధేశ్వరి భేటీ జరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..