
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. కన్నా రాజీనామా ప్రకటన తర్వాత ఆయన అనుచరులు కూడా కన్నా బాటలోనే పయనించారు. బీజేపీతో 9 ఏళ్ల బంధాన్ని వదులుకుంటున్నట్లు పేర్కొన్న ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. సోము వీర్రాజు తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మోడీ మీద నమ్మకం ఉందంటూనే రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు, జీవీఎల్ తీరును తీవ్రంగా తప్పుబడుతూ కన్నా లక్ష్మినారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలకు బీజేపీ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. సోము వీర్రాజుపై కన్నా చేసిన ఆరోపణల్ని ఖండించింది బీజేపీ. కన్నా రాజీనామా చేసిన తర్వాత పార్టీ పెద్దలతో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. అంతకు ముందు మీడియా పదే పదే అడిగినా స్పందించని జీవీఎల్.. పార్టీ నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరీ కన్నా తీరును తప్పుబట్టారు.
సోము వీర్రాజు వల్లే తాను రాజీనామా చేశానని కన్నా అంటే.. రాజకీయ దరుద్దేశంతోనే ఆయన విమర్శలు చేశారంటూ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. తనపై కన్నా చేసిన విమర్శలకు రియాక్ట్ కాబోనన్నారు జీవీఎల్. కాపు రిజర్వేషన్లు, ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉద్యమం జరిగినప్పుడు ఆయన మాట్లాడి ఉంటే బాగుండేదని విమర్శించారు కన్నా. జీవీఎల్ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విమర్శలపై స్పందించబోనని.. ఆ అవసరం లేదని జీవీఎల్ స్పష్టంచేశారు.
పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, అధిష్టానం సూచనతోనే సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. సోముపై కన్నా చేసిన ఆరోపణలు సముచితం కాదంటూ జీవీఎల్ పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..