AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ‘పవర్‌’ ఫుల్‌ పాలిటిక్స్.. పేదలు, మధ్య తరగతికి కరెంట్ షాకేనా.? ఉత్పత్తి వ్యయమెంత జనాలపై భారమెంత.?

సామాన్యుడి జీవితంతో ముడిపడిన అంశం కావడంతో సహజంగానే పార్టీలు దీనిని అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని బలంగా నిర్మించాలని భావిస్తున్నాయి విపక్షాలు.

ఏపీలో ‘పవర్‌’ ఫుల్‌ పాలిటిక్స్.. పేదలు, మధ్య తరగతికి కరెంట్ షాకేనా.? ఉత్పత్తి వ్యయమెంత   జనాలపై భారమెంత.?
Big News Big Debate Live Video 31 03 2022 On Ap Power War
Balaraju Goud
|

Updated on: Mar 31, 2022 | 10:06 PM

Share

AP Power Politics: సారా యుద్ధం ముగిసిందో లేదో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మళ్లీ పవర్‌ వార్‌ మొదలైంది. పెరిగిన కరెంట్ ఛార్జీల(Electricity Charges)పై విపక్షాలు ఉద్యమబాట పట్టాయి. మండు వేసవిలో ప్రజలు ఫ్యాన్‌ కూడా వేసుకోకుండా భారం మోపారని TDP అంటే.. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు బ్రాండ్‌ అంబాసిడార్‌ తెలుగుదేశమే అంటోంది అధికార YCP. అటు లెఫ్ట్‌ పార్టీలు తగ్గించాలని సబ్‌స్టేషన్లు ముట్టడిస్తే.. జనసేన, బీజేపీలు కూడా ధరాభారంపై భగ్గుమంటున్నాయి.

APERC ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ధరలు పెంచడం బాధాగా ఉన్నా తప్పడం లేదన్నారు. విద్యుత్ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారడంతో ధరలు పెంచామంటోంది ప్రభుత్వం. అయితే సంస్థలను ఆదుకోవడం కాదు ప్రజల నడ్డి విరచడమే అంటూ మండిపడుతున్నాయి విపక్షాలు. పెంచిన ధరలు తగ్గించాలంటూ సబ్‌స్టేషన్లను ముట్టడించాయి లెఫ్ట్‌ పార్టీలు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలతో అట్టుడికిపోయింది ఏపీ. పేదలకు షాకిచ్చిన జగన్‌కు 2024లో ప్రజలే పెద్ద షాక్ ఇస్తారంటోంది బీజేపీ. వారంపాటు సీఎం సామాన్యుల మధ్య జీవిస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయన్న బీజేపీ.. జగనన్న కరెంట్‌ షాక్‌ పథకం కొత్తగాప్రవేశపెట్టారన్నారు. అటు జనసేనలు కూడా కరెంట్‌ ఛార్జీలపై భగ్గుమంటోంది.

ఏపీ ప్రభుత్వం అనుసరించిన అస్తవ్యస్త విద్యుత్‌ విధానాలతో కరెంట్ సంక్షోభం తలెత్తిందని ఆరోపించింది టీడీపీ. ప్రభుత్వ అసంబద్ధ, తప్పుడు నిర్ణయాలవల్ల ప్రజలు భారం మోయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో మిగులు విద్యుత్ లో రాష్ట్రం ఉంటే.. ఇవాళ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసినా కోతలు తప్పడం లేదంటోంది. ఎన్నికలకు ముందు, ప్రమాణ స్వీకారంలో కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కరెంట్‌ ఛార్జీలపై లేనిపోని రాద్దాంతం తగదంటోంది ప్రభుత్వం. విద్యుత్‌ ఛార్జీలు పెంచి పేదలకు కరెంట్‌ షాకివ్వడంలో పేటెంట్‌ హక్కు చంద్రబాబుది కాదా అని ప్రశ్నిస్తోంది. బషీర్‌బాగ్‌ ఘటన సాక్ష్యం కాదా అంటూ పాత చరిత్రను గుర్తుచేస్తున్నారు మంత్రులు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు.. డిస్కమ్‌లను కాపాడుకోవడానికి ధరలు పెంచక తప్పడం లేదంటోంది ప్రభుత్వం.

సామాన్యుడి జీవితంతో ముడిపడిన అంశం కావడంతో సహజంగానే పార్టీలు దీనిని అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని బలంగా నిర్మించాలని భావిస్తున్నాయి విపక్షాలు. మరి అధికారపార్టీ దీనిని ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.

– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్

ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..