Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్‌ సక్సెస్.. ల్యాండైన తొలి విమానం

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్ విజయవంతమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ కావడంతో, భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి మరో అడుగు ముందుకెళ్లింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..

Bhogapuram: భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్ రన్‌ సక్సెస్.. ల్యాండైన తొలి విమానం
Bhogapuram Airport

Edited By:

Updated on: Jan 04, 2026 | 11:40 AM

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం కీలక దశను విజయవంతంగా దాటింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన తొలి ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలోనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం విశేషం. దీంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆపరేషనల్‌కు మరో అడుగు దగ్గరైంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్‌వేను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ట్రయల్ రన్ విజయంతో రన్‌వే సామర్థ్యం, భద్రతా ప్రమాణాలపై అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని టెక్నికల్ పరీక్షలు, ఆపరేషనల్ ట్రయల్స్ చేపట్టనున్నారు.

భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఇది ప్రధాన విమాన కేంద్రంగా మారనుంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు విశాఖపట్నంపై ఉన్న విమాన ప్రయాణ భారం తగ్గడంతో పాటు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన విమాన సేవలు లభించనున్నాయి. ఈ విమానాశ్రయం పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య, వ్యాపార రంగాల అభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు ఆకర్షించడంలో, ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కీలక పాత్ర పోషించనుంది. ఈ ఏడాది జూన్‌కు ముందే విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ. 4,750 కోట్ల వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నారు. జూన్ నాటికి నిర్మాణ పనులను 100 శాతం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవబోతోందని, ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..