Prakasam district: బీరు బాటిల్స్ లోడ్‌తో వెళ్తున్న లారీకి యాక్సిడెంట్.. స్థానికులు ఎలా ఎగబడ్డారో వీడియోలో చూడండి
బీరు బాటిల్స్ రోడ్డుపై కిందపడటంతో స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. ఎన్ని వీలుంటే.. అన్ని తీసుకుని అక్కడి నుంచి లగెత్తారు. శ్రీకాకుళం నుండి మదనపల్లికి బీరు లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
Beer bottles lorry accident: అసలే ఎండలు మండిపోతున్నాయి. బీర్లకు మస్త్ డిమాండ్ ఉంది. ఎన్నడూ లేనంతగా తాగేస్తున్నారు. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. అలాంటిది.. కళ్ల ముందు బారీ బాటిళ్లు కనిపిస్తే ఆగుతారా! ప్రకాశం జిల్లాలో అదే జరిగింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలోని నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బీర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో లారీలోని బీరు బాటిల్స్ కిందపడటంతో స్థానికులు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. శ్రీకాకుళం నుండి మదనపల్లికి బీరు లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. బీరు బాటిళ్లు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని పగిలిపోగా.. మిగతా వాటిని దొరికిన బాటిల్ దొరికినట్టు స్థానికులు ఎత్తుకెళ్లారు. పెద్ద మొత్తంలో బీరు సీసాలు రోడ్డు పాలవడంతో భారీ నష్టం జరిగింది. కాగా కొన్ని బాటిల్స్ పగిలిపోవడం చూసి.. అటుగా వెళ్తున్న మద్యం ప్రియులు ఉసూరుమన్నారు. బీరు బాటిళ్లు తీసుకెళ్లడానికి జనం ఎగబడుతుండటంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వచ్చి పరిస్థితి చక్కదిద్దారు.