సహజంగా వివిధ ప్రాంతాల్లో దొరికే చేపలు 1 కేజీ నుంచి 5 కేజీల వరకు బరువు ఉంటాయి. కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే 10 లేదా 15 కేజీల బరువు గల చేపలు మార్కెట్లో లభిస్తాయి. అయితే ఇక్కడ ఏకంగా సుమారు 30 కేజీల బరువు గల చేప దొరకడంతో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆ జాతికి చెందిన చేపలలో అంత బరువు గల చేపను తమ ప్రాంతంలో దొరకడం ఇదే ప్రథమమని వారు చెబుతున్నారు. అయితే ఆ భారీ చేపను మత్స్యకారులు ఏం చేశారు..? ఆ జాతికి చెందిన చేప అంత బరువు ఎలా పెరిగింది.. అనే విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలో ఎర్ర కాలువ జలాశయం ఉంది. చుట్టుపక్కల మత్స్యకారులకు జలాశయంలో చేపల వేట వాళ్ళ ప్రధాన జీవనాధారం. మామూలుగానే ఓ జాలరి తెల్లవారుజామున జలాశయం వద్దకు వెళ్లి చేపల కోసం ఎంతో ఆశగా వలవేశాడు. నీటిలో వలవేయగానే అది అడుగుకు చేరుకుంది. కాసేపు ఆగిన తరువాత ఆ జాలరి వలని పైకి లాగడం మొదలెట్టాడు. వల మాత్రం పైకి రావడం లేదు. ఏదో చిక్కుకున్నట్టుగా బరువుగా ఉండడంతో మరొకసారి వలను పైకి లాగేందుకు ప్రయత్నించాడు. వల చాలా బరువుగా ఉండటంతో అది పైకి రాలేదు. దాంతో బరువుగా ఉన్న వలను లాగేందుకు సమీపంలోని తన తన స్నేహితులను పిలిచాడు. వారి సహాయంతో వల లాగి చూడగా భారీ చేప ఆ వలలో చిక్కి కనిపించింది. ఆ చేపను చూడంగానే ఆ మత్స్యకారులు మొదట ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఆ చేపను వల నుంచి బయటకు తీసి జలాశయం ఒడ్డుకు తీసుకుని వచ్చారు. ఆ చేప బొచ్చే జాతికి చెందినదిగా గుర్తించారు. అరుదుగా మాత్రమే ఆ జాతిలో చేపలు ఇంత పెద్దవిగా పెరుగుతాయని, జలాశయం అడుగున ఎప్పటినుంచో ఈ చేప ఉండి ఉండవచ్చని, అయితే గత వారం రోజులుగా వాతావరణంలో చోటుచేసుకున్న అన్యుహ్య మార్పుల కారణంగా వేడి పెరగడంతో ఈ చేప పైకి వచ్చి ఉంటుందని… ఆ సమయంలోనే జాలరి వలకు చిక్కుకుని ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు.
మొదట దీనిని ఎలా విక్రయించాలనీ మత్స్యకారులు తర్జనభర్జన పడ్డారు. జలాశయం వద్దకు చేపలు కొనేందుకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో అక్కడ ఉన్న వారంతా కలిసి ఒక కిలో రెండు వందల చొప్పున ఆ భారీ చేపను కొని, దానిని కోసి వాటాలు వేసుకుని తమ ఇళ్లకు తీసుకువెళ్లారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..