
పుట్టలోని నాగన్న లేచిరవయ్యా.. అంటూ పాటలు పాడుతూ.. భక్తితో ప్రదిక్షణలు చేస్తూ.. పుట్టులో పాలు పోస్తే పుణ్యం అనుకునేవారు ఒకప్పుడు జనం. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్లిళ్లు లైవ్ టెలికాస్ట్‌లో చూసి వధూవరులను ఆశీర్వదించడం, చివరి చూపులకు రాలేక వాట్సాప్ వీడియో కాల్‌లోనే చివరి చూపు చూడడం.. ఇవన్నీ కొత్త యుగపు అలవాట్లుగా మారిపోయాయి. జీవిత రీతులు, ఉద్యోగ బంధాలు, సమయాభావం అన్నీ కలిపి మనిషిని బంధించాయి. పూజలు, వ్రతాలు అంటే ఒకప్పుడు వేదపండితులను పిలిచి ప్రత్యక్ష మంత్రోచ్ఛారణ చేసేవారు. మంగళ వాయిద్యాల సవ్వడి ఉండేది. కానీ ఇప్పుడు వాటి స్థానంలో డీజే బాక్స్, పెన్ డ్రైవ్ పాటలతో పూజలు జరిగిపోతున్నాయి. కారణం.. పండితులు, వాయిద్యకారులు అందుబాటులో లేకపోవడం లేదా ఎక్కువ ఖర్చులు.
హిందువులు అత్యంత భక్తి, శ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగులచవితి. కానీ నగరీకరణతో వనాలు, అడవులు నరికి పల్లెలు కూడా కాంక్రీట్ వనాలుగా మారిపోయాయి. ఫలితంగా పుట్టలు కనుమరుగయ్యాయి. ఆలయాల్లో ఇప్పుడు కృత్రిమ పుట్టలు ఏర్పాటవుతున్నాయి. దీంతో సిమెంట్ పుట్టలకు భారీ డిమాండ్ ఏర్పడింది.
Also Read: మీ కళ్లను మీరే నమ్మలేరు.. పామును పాప్‌కార్న్‌లా కరకరా నమిలి తిన్న కప్ప..
పూర్వం భక్తులు పొలాల గట్లు, మెట్టప్రాంతాల్లో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. ఇళ్ల దగ్గరే పుట్టలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకునే విధానం మొదలైంది. దీనికోసం శిల్పకళాకారులు పలు ఆకారాల్లో పుట్టలను తయారు చేస్తున్నారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన శిల్పి మంచ్యాల చంద్రశేఖర్, జాతీయ రహదారి పక్కన జాతీయ నాయకులు, దేవత విగ్రహాలతో పాటు నాగుల చవితి కోసం ప్రత్యేకంగా పాముల పుట్టలను తయారు చేశారు. సైజు ఆధారంగా ఇవి రూ. 30,000 నుంచి రూ. 35,000 వరకూ అమ్ముడవుతున్నాయి.
ఈ కృత్రిమ పుట్టలతో గ్రామం మధ్యలోనే నాగుల చవితి పూజలు చేయడం సులభమవుతోంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, భక్తితో పూజలు సాగించగలుగుతున్నారు. అయినా సరే ఇహానికి, పరానికి రెండింటికీ ఈ కొత్త ఆచారాలు ఆధునిక కాలపు ఆధారాలుగా మారిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.