AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డున పడ్డ ‘డాలర్ల పంట’.. కష్టానికి ఫలితం లేక ‘క్రాప్ హాలిడే’ వైపు ఆక్వా రైతుల అడుగులు!

పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజీకి రూ. 50 వరకు ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఒకప్పుడు డాలర్ల పంటగా పిలవబడిన రొయ్యల సాగు, నేడు పెట్టుబడులు పెరిగి, మద్దతు ధర కరువై రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది.

రోడ్డున పడ్డ ‘డాలర్ల పంట’.. కష్టానికి ఫలితం లేక ‘క్రాప్ హాలిడే’ వైపు ఆక్వా రైతుల అడుగులు!
Prawn Prices Drop
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 24, 2026 | 8:21 AM

Share

పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజీకి రూ. 50 వరకు ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. ఒకప్పుడు డాలర్ల పంటగా పిలవబడిన రొయ్యల సాగు, నేడు పెట్టుబడులు పెరిగి, మద్దతు ధర కరువై రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది. దళారులు, ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి తమను నిలువునా దోచుకుంటున్నారని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు.

ధరల తగ్గింపునకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, పాలకొల్లు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై రొయ్యలను కుప్పలుగా పోసి వినూత్నంగా నిరసన తెలిపారు. పాలకొల్లులోని పూలపల్లి సెంటర్‌లో భీమవరం – పాలకొల్లు ప్రధాన రహదారిపై రొయ్యలను పారబోసి భారీ మానవహారం నిర్వహించారు. రొయ్యల ధరను కేజీకి రూ. 30 నుండి రూ. 50 వరకు ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా తగ్గించేశాయని, మరోవైపు ఫీడ్ కంపెనీలు ధరలను విపరీతంగా పెంచేసి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నాయని రైతులు మండిపడుతున్నారు.

ఈ వివాదం నడుస్తుండగానే, ఎక్స్‌పోర్టర్లు ఈ నెలాఖరు వరకు ప్రస్తుతం నిర్ణయించిన రేట్ల మేరకే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. 100 కౌంట్ రొయ్యలు రూ 230, 40 కౌంట్ రూ 330, 30 కౌంట్ రూ 430 కి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆక్వా రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు మే నెల 29న అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆక్వా రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

గతంలో ఫీడ్ ధరల తగ్గింపు కోసం ఎంతో పోరాడి విజయం సాధించామని గుర్తు చేసుకున్న రైతులు, ప్రస్తుత సంక్షోభంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రొయ్యల ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు లేకుండా కనీస మద్దతు ధరను నిర్ణయించాలని కోరుతున్నారు. అలాగే, ఎగుమతిదారులు, దళారుల సిండికేట్ దోపిడీని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు తీసుకురావాలని, మార్కెటింగ్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడి కూడా తిరిగి రాని ఇలాంటి పరిస్థితుల్లో సాగు చేయడం సాధ్యం కాదని, ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ‘క్రాప్ హాలిడే’ ప్రకటిస్తామని రైతులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఆక్వా రంగానికి, దానిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us