AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కన్పించకుండా పోయిన ఆవు.. ఏం జరిగిందని కెమెరాలో చూస్తే గుండెలు గుభేల్..

గతంలో అడవికి వెళ్లిన ఆవులు రాకపోతే తప్పిపోయాయో లేక దొంగలు ఎత్తుకెళ్లారో అనుకునేవారు. కానీ ఇప్పుడు నల్లమల సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి కారణంగా అడవి వదిలి గ్రామాల శివార్లలోకి వస్తున్న పెద్దపులులు పశువుల మందలపై మాటు వేస్తున్నాయి. తాజాగా ట్రాప్ కెమెరాల్లో చిక్కిన పులి దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Andhra Pradesh: కన్పించకుండా పోయిన ఆవు.. ఏం జరిగిందని కెమెరాలో చూస్తే గుండెలు గుభేల్..
Tiger Attacks Cattle In Dornala Forest
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 16, 2026 | 8:27 PM

Share

మేత కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆవుల మందలోంచి ఓ ఆవు సాయంత్రానికి తిరిగి రాలేదంటే.. అక్కడ పులి మాటు వేసిందని అర్థం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో ఆవులు తప్పిపోవడమో లేదా దొంగలు ఎత్తుకెళ్లడమో జరిగేది. కానీ ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో, వన్యప్రాణులు అటవీ సరిహద్దు గ్రామాల్లోని శివారు ప్రాంతాల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా పెద్దపులులు ఆహారం, నీటి కోసం సమీప ప్రాంతాల్లో మాటు వేస్తుండటంతో గత నెల రోజులుగా పశువుల కాపరులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

రెండు ఆవులు మృతి.. గాయాలతో బయటపడ్డ మరో రెండు

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని ఊరకొండ పరిసరాల్లో మూడు రోజుల క్రితం ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక పశువుల కాపరులు ఆవులను మేత కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లారు. సాయంత్రం వేళ ఆవులు ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన కాపరులు అడవిలోకి వెళ్లి గాలించారు. ఈ క్రమంలో రెండు ఆవులు పులి దాడిలో రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటం కనిపించింది. అదే సమయంలో పులి పంజా నుంచి తప్పించుకున్న మరో రెండు ఆవులు తీవ్ర గాయాలతో ప్రాణభయంతో గ్రామానికి తిరిగి వచ్చాయి.

ట్రాప్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి దృశ్యాలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. దాడికి పాల్పడింది పెద్దపులా లేక చిరుతపులా అనే విషయాన్ని తేల్చేందుకు, అలాగే దాని కదలికలను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పులి దాడి చేసి చంపిన ఆవు కళేబరం వద్ద పకడ్బందీగా ఒక కెమెరాను అమర్చారు. ఆహారం కోసం రాత్రి సమయంలో చనిపోయిన ఆవు మృతదేహం వద్దకు మళ్లీ వచ్చిన పెద్దపులి దృశ్యాలు ఆ ట్రాప్ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఆవుల మందపై పంజా విసిరింది పెద్దపులేనని ఫారెస్ట్ అధికారులు అధికారికంగా నిర్ధారించారు.

గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు

ఆవులపై దాడి చేసింది పెద్దపులేనని తేలడం, పైగా అది ట్రాప్ కెమెరాకు చిక్కడంతో బొమ్మలాపురం పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సరిహద్దుల్లోకి ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దని, పశువులను మేత కోసం లోపలికి తీసుకెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటంతో అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Follow Us