AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: డీజిల్ సెస్ పేరుతో ‘బాదుడే బాదుడు’.. ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలు..

ఏపీలో RTC చార్జీలు ఇవాళ నుంచి పెరిగాయి. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రజలపై భారం వేసింది RTC. ఏసీ బస్సుల్లో పది రూపాయలు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అయిదు రూపాయలు, పల్లె వెలుగు బస్సుల్లో రెండు రూపాయల చొప్పున..

APSRTC: డీజిల్ సెస్ పేరుతో 'బాదుడే బాదుడు'.. ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలు..
Apsrtc
Sanjay Kasula
|

Updated on: Apr 14, 2022 | 6:51 AM

Share

ఏపీలో RTC చార్జీలు ఇవాళ నుంచి పెరిగాయి. డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రజలపై భారం వేసింది RTC. ఏసీ బస్సుల్లో పది రూపాయలు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అయిదు రూపాయలు, పల్లె వెలుగు బస్సుల్లో రెండు రూపాయల చొప్పున డీజిల్‌ సెస్‌ విధించింది APSRTC. దీనికి తోడు పల్లె వెలుగు కనీస చార్జీ పది రూపాయలకు పెంచింది. ఈ కనీస చార్జీకి అదనంగా సెస్‌ కింద రెండు రూపాయలు, సెఫ్టీ సెస్‌ రూపాయి ఉంటుంది. అంటే పదమూడు రూపాయలు అవుతుంది. చిల్లర సమస్య లేకుండా చేసేందుకు పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీని 13 నుంచి 15 రూపాయలకు రౌండాఫ్‌ చేస్తారు. డీజిల్‌ సెస్‌ పేరిట వడ్డనతో పెరిగిన చార్జీల ధరలు ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చాయి. APSRTC చివరిసారిగా 2019 డిసెంబర్‌లో చార్జీలను సవరించింది. ఇప్పుడు డీజిల్‌ సెస్‌ పేరుతో వడ్డనకు దిగింది.

అప్పుడు డీజిల్‌ లీటర్‌ 67 రూపాయలు ఉంటే ప్రస్తుతం 107 రూపాయలకు పెరిగిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమల రావు చెప్పారు. డీజిల్‌ ధర పెరుగుదలతో నష్టాలు భరించలేని విధంగా ఉండటంతో సెస్‌ విధించాల్సి వచ్చిందన్నారు. 2019 డిసెంబర్‌ నుంచి డీజిల్‌ రేటు 60 శాతం పెరిగిందని, రెండేళ్లుగా ఆర్టీసీతకి 5,680 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు.

ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో డీజిల్‌ సెస్‌ పెంచామన్నారు. ఆర్టీసీ లాభాలు రాకపోయినా నష్టాలు లేకుండా ఉండాలంటే చార్జీలు 32 శాతం పెంచాల్సి ఉందన్నారు. డీజిల్‌ సెస్‌ వడ్డనతో ప్రజలపై ఏడాదికి 720 కోట్ల రూపాయల భారం పడనుంది. ప్రజలు ఎక్కువగా ప్రయాణించేది పల్లె వెలుగులోనే. వాటిలో కనీస చార్జీ మూడు రెట్లు కావడం పేదలకు మోయలేని భారం కానుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే ప్రయాణీకులపై ఆర్టీసీ సెస్ వాయింపుపై టీడీపీ(Tdp) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్(Cm Jagan) తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు(Nara Chandrababu Naidu) ఆరోపించారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్​లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచటం కరెక్ట్ కదాన్నారు. ప్రభుత్వం తన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నారు.  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్న చంద్రబాబు.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వామపక్షాలు ఫైర్..

మరోవైపు ఆర్టీసీ ప్రయాణీకులపై డీజిల్ సెస్ భారంపై వామపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నాయి. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.  ఇప్పటికే అధిక ధరలు, పెంచిన పన్నుల భారంతో జనజీవనం అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలను పెంచి మరో రూ.720 కోట్లు ప్రజలపై భారం మోపడం తగదన్నారు. పన్నుల భారాలు, చార్జీల మోతలే ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగటం విచారకరమని తెలిపారు.

ఇదేం పద్దతి: బీజేపీ

డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైరయ్యారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్లె వెలుగు బస్సుల్లో టికెట్ల ధరలు పెంచడం దారుణమన్నారు.  సామాన్యులు ప్రయాణం చేసే పల్లె వెలుగు బస్సుకి 10 రూపాయలు కనీస ధర చేయడం దారుణమన్నారు.  20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాం అని చెప్తూ రేట్లు పెంచడమేంటని ప్రశ్నించారు. నష్టాల్లో ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కానీ రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ ప్రయాణాన్ని సామాన్యులకు దూరం చేస్తుందని సోము వీర్రాజు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!