HIV – AIDS: ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం.. కానీ ఆ జిల్లాలో మాత్రం..

|

Dec 02, 2022 | 7:32 AM

ఆంధ్రప్రదేశ్ లో హెచ్‌ఐవీ పాజిటివిటీ తగ్గుముఖం పట్టిందని ఏపీఎస్ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీఎస్. నవీన్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలోనే నమోదవుతున్నాయని వివరించారు...

HIV - AIDS: ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం.. కానీ ఆ జిల్లాలో మాత్రం..
Hiv Aids
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో హెచ్‌ఐవీ పాజిటివిటీ తగ్గుముఖం పట్టిందని ఏపీఎస్ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీఎస్. నవీన్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక కేసులు తూర్పుగోదావరి జిల్లాలోనే నమోదవుతున్నాయని వివరించారు. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవి) పాజిటివిటీ రేటు సంవత్సరాలుగా తగ్గుముఖం పడుతోందని, 2022-23 సంవత్సరంలో 0.87%కు తగ్గుతుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 1న నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ పరిస్థితులపై వివరాలు తెలిపారు. 2010-11 సంవత్సరంలో సాధారణ జనాభాలో, ముఖ్యంగా గర్భిణీలలో హెచ్‌ఐవీ పాజిటివ్ రేటు 6.74% ఉంది. 2022-23 నాటికి గర్భిణీ స్త్రీలలో ఆ రేటు 0.05%కు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 2,09,888 మంది రోగులు హెచ్‌ఐవి ప్రేరిత అక్వైర్డ్ ఇమ్యునో డిఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్)తో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 53 యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఎఆర్‌టి) కేంద్రాలు, 116 ఎఆర్‌టి సబ్‌సెంటర్లు ఉన్నాయని, వాటి ద్వారా వ్యాధి సోకిన వారికి చికిత్స అందుతోందని చెప్పారు.

2021-22 సంవత్సరంలో మొత్తం 23,57,260 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించగా.. 13,815 మందికి ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,926 పాజిటివ్‌ కేసులు, ఆ తర్వాత గుంటూరు (1,878 కేసులు), కృష్ణా (1,697), విశాఖపట్నం (1,221), పశ్చిమగోదావరి (1,218), ప్రకాశం (1,182) ఇతర జిల్లాల్లో వెయ్యి లోపు కేసులు నమోదయ్యాయని నవీన్ కుమార్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివిటీ రేటు అత్యధికంగా 0.90%, అత్యల్పంగా విజయనగరంలో 0.35% నమోదైందని వివరించారు.

ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా నిర్మూలన కాలేదు. దీంతో ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఒకరికంటే ఎక్కువమందితో శృంగారం, రక్త మార్పిడి, కలుషిత సిరంజీల వాడకం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధికి గురైన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. హెచ్ఐవీ బారిన పడ్డ వారి సంఖ్యలో మహారాష్ట్ర టాప్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..