విశాఖపట్నం, అక్టోబర్19; ఏజెన్సీలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తుంది. పిల్లలు వృద్దులు మహిళలతో కలిపి దాదాపుగా 40 మంది ప్రయాణికులు..! దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చేసరికి ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. డ్రైవర్ దిగి చెక్ చేస్తే.. లోపం ఎక్కడుందో తొలుత అర్థం కాలేదు. ఆ తర్వాత డీజిల్ ఆయిల్ ట్యాంక్ మూత విప్పి పరిశీలిస్తే… అందులో చుక్క ఆయిల్ కూడా లేదు. మరి డీజిల్ లేకుండా బస్సు ముందు కదులుతుందా..? పోనీ డీజిల్ నింపుదామనుకున్నా కిలోమీటర్ల వరకు ఎక్కడ పెట్రోల్ బంకు జాడ ఉండదు. మరి అర్ధరాత్రి కారు చీకటిలో దట్టమైన అడవిలో ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది.. పొగ మంచుతో విపరీతమైన చలి.. దొంగల భయం కూడా ఆ ఘాట్రోడ్లో ఉంటుంది.. ఒక్కో క్షణం బిక్కు బిక్కు మంటూ గడిపారు..
– విశాఖపట్నం డిపోకు చెందిన ఏపీ31Z 0339 నెంబర్ గల ఆర్టీసీ బస్సు భద్రాచలం నుంచి విశాఖపట్నం బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారాలమ్మ ఘాట్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో బస్సు ఒక్కసారిగా ఆగిపోయిది. డ్రైవర్ కిందకు దిగి తనిఖీ చేశాడు. ఎక్కడ ఎటువంటి లోపం కనిపించలేదు. చివరకు.. డీజిల్ ట్యాంక్ లో చెక్ చేసేసరికి.. అందులో ఆయిల్ లేనట్టు గుర్తించారు. అసలే అర్ధరాత్రి బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకపక్క మావోయిస్టుల భయం,.. మరోపక్క దొంగల భయం.. మరోపక్క చలిలో ప్రయాణికులు నరకాన్ని చవిచూశారు. కాసేపటికి పరిస్థితి గుర్తించిన డ్రైవర్.. ఈ విషయాన్ని ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. ఆర్టీసీ అధికారులు స్పందించి సీలేరులో ఉన్న నైట్ హాల్ట్ బస్సు ని తరలించారు. ఆగిపోయిన బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని విశాఖపట్నం తరలించాలని అధికారులు ఆదేశించారు. అప్పటికే రెండు గంటలు గడిచిపోయాయి. వృద్ధులు పిల్లలు మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. చలికి గజగజ వణికిపోయారు. భయంతో బిక్కుబిక్కుమన్నారు. సీలేరు నుంచి నైట్ హార్ట్ సర్వీసు బస్సు ఘటనా స్థలికి చేరుకోవడంతో.. ఆ బస్సులో ప్రయాణికులు విశాఖ బయలుదేరారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బాధ్యులెవరు..?!
– అల్లూరి జిల్లా లో అర్ధరాత్రి ఘాట్ రోడ్లో ఆగిపోయింది ఆర్టీసీ బస్సు. బస్సులో 40 మంది ప్రయాణికులు, పిల్లలున్నారు. రెండు గంటల పాటు కారు చీకట్లో ఇబ్బందులు పడ్డరు ప్రయాణికులు. భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా బస్సు ఆగిపోయింది. మరో బస్సులో విశాఖకు ప్రయాణికుల తరలించదంతో అంతా ఊపిరిపించుకున్నారు. ఇంతవరకు ఓకే.. కానీ ఈ ఘటనకు బాధ్యులెవరు..? బస్సు ఖమ్మం నుంచి బయలుదేరే ముందు డీజిల్ సరిపోతుందా లేదా ఎంతవరకు ఉందని దానిపై ఆర్టీసీ సిబ్బంది చెక్ చేసుకోవాలి. సరిపడా డీజిల్ లేకుంటే .. ట్యాంకులో ఆయిల్ ను నింపాలి. ఒకవేళ ట్యాంకర్ కారిపోయేలా ఉంటే దానికి మరమ్మతులు చేయాలి. కానీ ఇందులో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సరిపడా డీజిల్ నింపుకోకుండానే ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరిపోయింది. సగం దూరం వచ్చాక డీజిల్ అయిపోవడంతో మార్గమధ్యలోనే అడవిలో ఆగిపోయింది ఆర్టీసీ బస్సు. బస్సు దారాలమ్మ ఘాట్ రోడ్డులో అర్ధరాత్రి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోతూ కాలం గడిపారు. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యానికి అంతమంది ప్రయాణికులు గంటల పాటు నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..