అమరావతి, నవంబర్ 5: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్లకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను మంజూరు చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నవంబర్ నుంచే కొత్త పింఛన్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్‌లో ఈ దరఖాస్తుల్ని పరిశీలించి జనవరిలో కొత్త పింఛన్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పింఛన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వరుసగా 2 నెలలు పింఛను తీసుకోకపోయినా 3వ నెల ఆ మొత్తం పింఛను కలిపి లబ్ధిదారుకు అందించాలని, వచ్చే డిసెంబరు నెల నుంచే మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే వెసులు బాటును అమల్లోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే భర్త చనిపోయిన వితంతువులకు సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన మరుసటి నెల నుంచే వితంతు కేటగిరీలో పింఛను మంజూరు చేయాలని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు వివిధ కేటగిరీల్లో పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు అయినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలని అధికారులను కోరారు. తనిఖీల్లో పింఛన్‌లకు అనర్హులైన వారి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపి క్షేత్రస్థాయిలో మరోమారు సమీక్షించాలని అదేశించారు. ఈ దశలో కూడా అనర్హులుగా నిర్ధారణయితే పింఛన్ నిలిపివేయాలని తెలిపారు. ఒకవేళ అర్హుల పింఛన్లు తొలగిస్తే గ్రామసభల్లో ఫిర్యాదులు తీసుకుని.. నిబంధనల మేరకు పింఛను కొనసాగించాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఎస్‌వోపీని తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.