ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) తగు ఏర్పాట్లు చేయడం కూడా ప్రారంభించింది. అయితే అందుకు ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకుంటోంది ఎపీఈఆర్‌సీ. ఈ నేపథ్యంలోనే నేటి(జనవరి 19) నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్చ్యువల్ పద్దతిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నామని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే పబ్లిక్ హియరింగ్‌లో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కమ్‌ల సీఎండీలకు సూచించారు.
అయితే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది వినియోగదారులు పాల్గొనేలా శాఖ సిబ్బందితో ప్రచారం చేయాలని ఏపీఈఆర్‌సీ చైర్మన్ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగదారులు/ఫిర్యాదుదారులు తమ సూచనలు, అభ్యంతరాలను సర్కిల్, డివిజన్ కార్యాలయాల నుంచి తెలియజేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని నాగార్జున రెడ్డి దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ పెంపుపై అభ్యంతరాలున్నవారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డివిజన్ కార్యాలయాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ https://ncubestreamings.com/apercpublichearing వెబ్ లింక్ ద్వారా మూడు రోజుల పాటు.. ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుందని ఏపీఈఆర్‌సీ చైర్మన్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..