Andhra Pradesh: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా..?
ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం రాబోయే 2 నుంచి 3 రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చబోతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమ వ్యాప్తంగా రాగల 72 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న గంగా పరివాహక పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం రాబోయే 2 నుంచి 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రాంతం సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి జైసల్మేర్, షియోపూర్, దతియా, సిద్ధి, డాల్టన్‌గంజ్ మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వైపు సాగుతోంది.
ప్రాంతాల వారీగా వాతావరణం ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర – యానాం..
శనివారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలుల వేగం గంటకు 50-60 కిలోమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్..
రాగల మూడు రోజుల పాటు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచవచ్చు.
రాయలసీమ
రాబోయే మూడు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది.
వర్ష సూచన ఉన్నప్పటికీ, రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
